
కంభం: బ్రిటిష్ కాలంలో 1915లోనే కాపు, తెలగ, బలిజ, కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయని, ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేదేమీ లేదని గవర్నర్ సంతకంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేయవచ్చని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా ఈ జాతి రిజర్వేషన్లు అనుభవించిందన్నారు.
ఆదివారం ప్రకాశం జిల్లా కంభంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న కాపులకు రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ప్రధాని అనుమతితో రాష్ట్రపతి ఆమోదం అవసరమని, రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుకు గవర్నర్ సంతకంతోనే అమలు చేయవచ్చన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాపురిజర్వేషన్లు ఖాయమన్న ముఖ్యమంత్రి నాలుగేళ్లు గడుస్తున్నా మంజునాథ కమిషన్ పేరిట కాలయాపన చేశారన్నారు. మార్చి 31లోగా రిజర్వేషన్ల ఆంశం పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కాపు నాయకులతో చర్చించి ఉద్యమిస్తామన్నారు.