కుట్రలతో ఉద్యమాన్ని ఆపలేరు
కాపు ఉద్యమ నేత ముద్రగడ
ఆలమూరు (కొత్తపేట) : ముఖ్యమంత్రి చంద్రబాబు దిగుజారుడు రాజకీయాలు చేస్తూ ఎన్ని కుట్రలు పన్నినా కాపు ఉద్యమాన్ని ఆపలేరని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. చెముడులంకలో కాపు నాయకుడు నయనాల హరిశ్చంధ్ర ప్రసాద్ నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికే చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే కుట్రలు చేస్తున్నారని, కాపు సోదరులు అప్రమత్తంగా ఉండాలన్నారు.. ఎంతో కాలంగా కలిసి మెలసి జీవిస్తున్న కాపులు, బలిజ, ఒంటరి, తెలగ కులాల మధ్య చిచ్చు పెడుతూ ప్రాంతాలను బట్టి ఒక్కో హమీ ఇస్తూ దిగజారుడు రాజకీయాలు చేపడుతున్నారన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను చంద్రబాబు గ్రహించాలని హితవు పలికారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న చంద్రబాబు.. ఇప్పుడు చిత్తు కాగితాల్లా మార్చేశారన్నారు. ఓసీనియర్ రచయిత చెప్పినట్టుగా ‘కాపులను గిల్లుతూ బీసీలను జోల పాడుతున్నారని, మరోసారి బీసీలను గిల్లుతూ కాపులను జోలపాడుతున్నారని’ఎద్దేవా చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేలా శాంతియుతంగా ఉద్యమించి సీఎం చంద్రబాబు అహంకారాన్ని దించుతామన్నారు.
కాపు న్యాయవాదుల సంఘీభావం
రిజర్వేషన్ల సాధన కోసం అండగా ఉంటామంటూ కాపు న్యాయవాదులు ఉద్యమానికి సంఘీభావం తెలిపినట్టు ముద్రగడ తెలిపారు. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెంది కాపు న్యాయవాదులు సమావేశాన్ని ఇటీవల నిర్వహించగా వారందరూ కాపు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలికారన్నారు. అక్రమ కేసులపై ఆందోళన చెందవద్దని, ఉచితంగా న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
టీడీపీ నేతల మాదిరిగా అక్రమాలకు, దోపిడీలకు పాల్పడటం లేదని, అందువల్ల కేసుల కోసం భయపడే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో మంజునాథ కమిషన్ నివేదికను వెంటనే రప్పించుకుని కాపులను రిజర్వేషన్ల జీఓ విడుదల చేయాలని ముద్రగడ డిమాండు చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కావాలనే కొందరు దురుద్దేశ్య పూర్వకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. కాపు నాయకులు ఆకుల రామకృష్ణ, బండారు శ్రీనివాసరావు, చల్లా ప్రభాకరరావు, తమ్మన శ్రీనివాసు, కల్వకొలను తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక కేటగిరిలో రిజర్వేషన్లు ఇవ్వాలి
పి.గన్నవరం : బీసీ సోదరులు అనుభవించే ఏబీసీడీ కేటగిరిలు కాకుండా ప్రత్యేక కేటగిరిలో రిజర్వేషన్లు అమలు చేయాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. మండలంలోని కుందాలపల్లి శివారు పప్పులవారిపాలెంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. బీసీలకు కేటాయించిన 49 శాతం పోగా, మిగిలిన 51 శాతంలో మాత్రమే జనాభా ప్రాతిపదికన కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. క్రిమిలేయర్ పెట్టి కాపుల్లో పేదలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాలయాపన చేయకుండా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు నల్లా విష్ణుమూర్తి, టీబీకే జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, కల్వకొలను తాతాజీ, కొమ్మూరి మల్లిబాబు, పప్పుల తాతారావు తదితరులు పాల్గొన్నారు.