kaapu garjana
-
ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష
-
కాపు జాతికి న్యాయం కోసమే దీక్ష: ముద్రగడ
* భార్యతో కలసి శుక్రవారం ఉదయం 9 గంటలకు దీక్ష ప్రారంభం * డిమాండ్లు సాధించేవరకు వెనుదిరిగేది లేదన్న ముద్రగడ... నిరాహార దీక్ష విషయంలో ఎలాంటి మార్పూ లేదని ప్రకటన * జాతి కోసం సహధర్మచారిణితోపాటు జీవితం అంకితమిస్తానని వెల్లడి * మధ్యాహ్నం భోజనం మానేసి ఖాళీ కంచాలతో నిరసనలకు పిలుపు * దీక్షపై పోలీసుల ఉక్కుపాదం * జిల్లాయేతరులు తూర్పుగోదావరిలో ప్రవేశించొద్దన్న ఎస్పీ.. జిల్లావాసులు కూడా కిర్లంపూడికి వెళ్లొద్దని సూచన (కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జీవిత భాగస్వామి పద్మావతితో కలిసి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కాపు జాతికి న్యాయం కోసమే దీక్ష: ముద్రగడ కాపు జాతికి న్యాయం చేయడం కోసమే దీక్ష చేపడుతున్నట్లు ముద్రగడ చెప్పారు. తాను కొత్త డిమాండ్లేమీ పెట్టలేదని, గొంతెమ్మ కోర్కెలేవీ కోరడం లేదని, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లే నెరవేర్చాలని కోరుతున్నానని చెప్పారు. ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూడకుండా దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. డిమాండ్లు సాధించేవరకు వెనుదిరిగే ప్రసక్తే లేదని పద్మనాభం అన్నారు. డిమాండ్లను పరిష్కరించే ప్రతిపాదనలతో వస్తే పరిశీలించి తాను తృప్తి చెందితే దీక్ష విరమిస్తానని చెప్పారు. తన దీక్షకు అడ్డుతగలవద్దని తనతో చర్చలకు వచ్చిన వారిని కోరానన్నారు. గత నెల 31న జరిగిన విధ్వంసంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలనీ, అవసరమైతే సీబీఐ చేత విచారణ చేయించాలని కోరినట్లు ముద్రగడ చెప్పారు. కాపు జాతి ప్రయోజనాల కోసం తాను... తన శ్రీమతి పద్మావతి జీవితం అంకితమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేసే అంశంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు. దీక్ష చేపడుతున్న తనకు మద్దతు తెలిపే ఉద్దేశంతో పెద్దసంఖ్యలో రావడం వల్ల మరోసారి అసాంఘిక మూకలకు అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. ఇది ఆఖరి పోరాటమనీ, ఎవరూ ఆవే శపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. కాకినాడలో జరిగిన సోదరుడి ఆత్మహత్య సంఘటనల వంటివి పునరావృతం కారాదన్నారు. -
నా జాతి కోసం ఏమైనా చేస్తా: ముద్రగడ
కాకినాడ: కాపు గర్జన ఉద్యమం తీవ్రరూపం దాల్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆమరణ దీక్ష ప్రారంభించనున్నట్లు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనతో పాటు భార్య కూడా ఈ ఆమరణ దీక్షలో కూర్చోనున్నట్లు వెల్లడించారు. కాపులకు రిజర్వేషన్ల సాధనే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. తన కాపు జాతి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ముద్రగడ వివరించారు. తనతో చర్చించడానికి ఎవరైనా వస్తే అందుకు తాను సిద్ధమని.. అయితే, కాపులకు న్యాయం జరుగుతుందని భావిస్తే మాత్రమే చర్చల్లో పాల్గొంటానని ముద్రగడ పద్మనాభం వివరించారు. -
టీడీపీ నేతల గురించి అలా అనలేదు: మంత్రి నారాయణ
విజయవాడ: టీడీపీలోని అందరు నేతలతోనూ తాను మంచి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనలో టీడీపీ నేతలు ఉన్నట్లు తాను చెప్పలేదని మంత్రి అన్నారు. రోడ్ల విస్తరణ కారణంగా 1000 ఇళ్లను తొలగించాల్సి ఉందని.. ఈ నెల 15వ తేదీలోగా మాస్టర్ల ప్లాన్ పూర్తి అవుతుందని తెలిపారు. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్, మాస్టర్ ప్లాన్ కు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు 13 గ్రామాల్లో పర్యటించి ఇళ్లు కోల్పోతున్నవారిలో 90 శాతం మందికి నచ్చజెప్పినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ ఖారారయిన తర్వాతే ఇళ్ల తొలగింపు చేపడతామని నారాయణ పేర్కొన్నారు. ఇళ్లను తొలగిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆర్కే ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. చెప్పని మాటలు ప్రచారం చేయడం సమంజసం కాదని చెప్పారు. ఒక వర్గానికి తనను దూరం చేసేందుకే తనపై దుష్రచారం చేస్తున్నారంటూ మంత్రి నారాయణ మండిపడ్డారు. -
చంద్రబాబే ఉద్యమంలోకి దుష్ట శక్తులను జొప్పించారు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కాపు ఉద్యమంలోకి దుష్టశక్తులను జొప్పించి తుని దౌర్జన్యకర సంఘటనలకు కారకులయ్యారని, ఇందుకు ఆయనదే పూర్తి బాధ్యత అని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు తుని ఘటనలపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ ఉద్యమాల్లోకి దుష్టశక్తులను జొప్పించి దానిని నీరుగార్చడం ఆయనకు అల వాటేనన్నారు. ఇప్పుడు కూడా అలాగే చేశారన్నారు. ఎక్కడ ఏం జరిగినా జగన్పై అభాండాలు వేయడం ఏ మాత్రం సరికాదని చెప్పారు. జీతాలు చెల్లించడానికే నిధులు లేనందువల్ల రూ.100 కోట్లే కేటాయించానని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య తిరగడానికే ప్రత్యేక విమానాల కోసం వందలాది కోట్లు వెచ్చించారని, ఇష్టానుసారం ఆడంబరాలకు ఖర్చు చేస్తూ కాపులకు ఇవ్వడానికే నిధులు లేవని చెప్పడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుష్కరాలు, పట్టిసీమ, చంద్రన్న కానుక పేరుతో వందల కోట్లు తగలేసిన ముఖ్యమంత్రికి కాపులకు ఇవ్వడానికే నిధులుండవా అని ప్రశ్నించారు. తునిలో జరిగిన సంఘటనలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే పూర్తి బాధ్యత వహించాలని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో నిర్ణీత కాల వ్యవధిలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు మాట ఇచ్చి నెరవేర్చనందు వల్లనే ఆ వర్గంలో అశాంతి చెలరేగిందని పేర్కొన్నారు. కాపుల సంక్షేమానికి ఏడాదికి రూ.1000 కోట్లు కేటాయిస్తానని చెప్పి గత 20 నెలల పాలనలో రూ.100 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. పెపైచ్చు ముఖ్యమంత్రితో సహా అందరూ రెచ్చగొట్టేలా మాట్లాడ్డమే తప్ప.. మేమున్నామంటూ ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ కాపుల కు నచ్చజెప్పి వారిలో స్థైర్యం నింపే యత్నం చేయలేదన్నారు. తునిలో జరిగిన సంఘటనలు దురదృష్టకరమన్నారు. సంయమనం పాటించాలని తమ పార్టీ అందరినీ కోరుతోందని చెప్పారు. కాపు గర్జన జరిగిన ఉభయగోదావరి జిల్లాల ప్రాంతం ఎక్కువగా వ్యవసాయాధారితమైనదని, చంద్రబాబు విధానాలపై అక్కడి రైతులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. అన్ని రకాల అసంతృప్తులూ తుని సంఘటనలకు కారణమన్నారు. తుని సంఘటనలకు తన వైఖరే కారణమనే విషయం గుర్తించకుండా ఇంకా ఈ ఘటనలను కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు ప్రయత్నించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న వారు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికవేత్తలకు ఇవ్వడానికి డబ్బులున్నాయా?: అంబటి రాంబాబు కాపులకు ఇవ్వడానికి నిధులు లేవని సాకులు చెబుతున్న చంద్రబాబునాయుడుకు.. పారిశ్రామికవేత్తలకు రూ.2,500 కోట్ల సబ్సిడీ బకాయిలు చె ల్లించడానికి మాత్రం డబ్బులున్నాయా అని వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన వ్యక్తి ఇపుడు వంద కోట్లే కేటాయించి జీతాలకు డబ్బు లేవని చెబుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి తెలియకుండానే చంద్రబాబు హామీలు ఇచ్చారా అని అడిగారు. పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ బకాయిలు చెల్లించి 400 కోట్లు దోచుకోలేదా అని ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపన కోసం రూ.400 కోట్లు దుబారాగా ఖర్చు చేయడానికి, ప్రత్యేక విమానాల్లో తిరగడానికి మాత్రం డబ్బులున్నాయా అన్నారు. విచ్చలవిడిగా అయిన దానికీ కాని దానికీ వేల కోట్లు తగలేస్తున్న చంద్రబాబు కాపుల వద్దకు వచ్చేటప్పటికే నీతులు చెబుతారా అని విమర్శించారు. తునిలో జరిగిన సంఘటనలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ ఘటనలకు అధికారపక్షం అందరిపైనా ఆరోపణలు చేసే బదులు అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని అంబటి హితవు పలికారు. -
రగిలిన 'గర్జన'
ఉవ్వెత్తున కాపు రిజర్వేషన్ ఉద్యమం రాస్తారోకో, రైల్రోకోలతో అట్టుడికిన తూర్పు ప్రత్యక్ష ఆందోళనలోకి లక్షలాదిమంది.. ఆగ్రహజ్వాలలకు రత్నాచల్ దగ్ధం రెండు పోలీస్స్టేషన్లు, పలు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఫ్లెక్సీలకు నిప్పు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదించిన ఉద్యమకారులు పొద్దుపోయే వరకు ఆందోళన.. ఉద్యమానికి తాత్కాలిక విరామం నేటి సాయంత్రం వరకు గడువు.. లేదంటే ఆమరణ దీక్ష: ముద్రగడ ఏపీలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం భగభగమండింది. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్తో తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఆదివారం జరిగిన ‘కాపు ఐక్య గర్జన’ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలకు ‘రత్నాచల్’ రైలుతో పాటు పదుల సంఖ్యలో కార్లు, వందలాది ద్విచక్ర వాహనాలు, రెండు పోలీసు స్టేషన్లు దగ్ధమయ్యాయి. సభకు హాజరు కానీయకుండా పలుచోట్ల ఆటంకాలు కల్గించడం, మార్గమధ్యంలో గంటల తరబడి ఆపి వెనక్కు పంపే ప్రయత్నం చేయడం ఆందోళనకారులలో అసహనాన్ని రెట్టింపుచేసింది. బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. గద్దెనెక్కగానే ప్లేటు ఫిరాయించడం కాపుల్లో ఆగ్రహావేశాలను రగిలిం చింది. సభకు హాజరైన లక్షలాది మంది ఉద్యమకారులలో అది ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రత్యక్ష ఆందోళనకు దిగుదామని ఐక్యగర్జన సారథి, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపునివ్వగానే వారంతా సీఎంకు వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ జాతీయరహదారిపైకి, రైలు పట్టాలపైకి ఉత్సాహంగా చేరిపోయారు. వేలాది వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. విజయవాడ - విశాఖ మధ్య రైళ్లు ఆగిపోయాయి. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం, రత్నాచల్ ఆందోళనకారులపైకి దూసుకురావడంతో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో వారు రైలును దగ్ధం చేయడమే కాక 2 పోలీస్స్టేషన్లనూ అగ్నికి ఆహుతి చేశారు. అనేక వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రయాణికుల ఇబ్బందుల నేపథ్యంలో ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రాత్రి 9.30 గంటల సమయంలో ముద్రగడ ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడకపోతే నేటి సాయంత్రం ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన అల్టిమేటమ్ జారీ చేశారు. (తుని నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) రాష్ర్టంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం భగ్గుమంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆకస్మిక నిర్ణయంతో ఐక్య గర్జన ఉగ్ర రూపం దాల్చింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు, పదుల సంఖ్యలో కార్లు, వందలాది ద్విచక్ర వాహనాలు, రెండు పోలీసు స్టేషన్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తూర్పుగోదావరి జిల్లాకు అదనపు బలగాలను రప్పిస్తుండగా ముద్రగడ రాష్ట్ర ప్రభుత్వానికి 24గంటల డెడ్లైన్ విధిస్తూ జాతీయ రహదారిపై దీక్షను తాత్కాలికంగా విరమించారు. వి.కొత్తూరుకు సమీపంలోని జాతీయ రహదారిపై రాత్రి 9.30 వరకు ధర్నా చేసిన ముద్రగడ సోమవారం సాయంత్రం వరకు ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు. లక్షలాదిమంది కార్యకర్తల ఆందోళనతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. విశాఖ, విజయవాడ వైపు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తుని, అన్నవరం తదితర ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల పోలీసులు ఆంక్షలు విధించారు. అశేషంగా తరలి వచ్చిన జనం కాపుల రిజర్వేషన్ల సాధనకు ముద్రగడ ఆదివారమిక్కడికి సమీపంలోని వి.కొత్తూరు వద్ద నిర్వహించిన ఐక్య గర్జనకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు, ఒంటరి కులస్తులు తరలివచ్చారు. సభా ప్రాంగణమైన 80 ఎకరాల కొబ్బరి తోట ఆందోళనకారులతో కిటకిటలాడింది. ఉదయం పది గంటల నుంచే సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తింది. వేదిక వైపు దూసుకువచ్చే యువతను ఆపడం నిర్వాహకులకు కష్టతరమైంది. సభ ఒంటి గంటకు ప్రా రంభం కావాల్సి ఉన్నా గంటకు పైగా ఆలస్యమైంది. ఈలోపు వేదిక ముందుకు యువత తోసుకురావడంతో మీడియా కోసం నిర్మించిన వేదికసైతం కూలిపోయింది. మైకులు మొరాయించాయి. వేదికపైన ఉన్న వారు ఎవరేమి మాట్లాడుతున్నారో అర్థం కాక గందరగోళం ఏర్పడింది. ఈదశలో మైకు తీసుకున్న ముద్రగడ సభికులను ప్రశాంతంగా ఉండాలని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. ముద్రగడ ఆకస్మిక నిర్ణయం... ముద్రగడ పద్మనాభం సుదీర్ఘంగా మాట్లాడతారన్న దానికి భిన్నంగా కేవలం 8 నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించి సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. చాలా ప్రశాంతంగా ప్రసంగాన్ని మొదలు పెట్టిన ముద్రగడ పదండి పట్టాలపైకి అంటూ వేదిక దిగి పోవడంతో మరెవ్వరికీ మాట్లాడడానికి అవకాశమే లేకుండా పోయింది. వేదికపై అప్పటికే వీహెచ్, జక్కంపూడి విజయలక్ష్మి, కన్నా లక్ష్మినారాయణ ఉన్నారు. వేదికపైకి పోయేందుకు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, కె.కన్నబాబు తదితరులు ఉద్యుక్తులవుతుండగానే జైజై నినాదాల మధ్య ముద్రగడ జాతీయ రహదారి వైపు బయలుదేరారు. అంతటా ఉద్రిక్తత తొక్కిసలాట జరుగుతుంది ఏమిటో అర్థం కాక సభికులు హడావిడి పడ్డారు. అటూఇటూ ఉరుకులు పరుగులు పెట్టారు. ఏవైపు చూసినా చీమల దండుల్లా జనం జాతీయ రహదారి వైపు వెళ్లి రైలు పట్టాల వైపు పరుగులు తీశారు. అప్పటికే ముద్రగడ అక్కడికి సమీపంలోని రైలు పట్టాలపై కుటుంబ సభ్యులతో బైఠాయింపు చేయడం, జనం పట్టాలపైకి వచ్చి రత్నాచల్ ఎక్స్ప్రెస్ను ఆపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత ముద్రగడ తిరిగి జాతీయ రహదారిపైకి వచ్చి ఓ ఆటోపైన కూర్చుండిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఏపార్టీలో చేరనని, కాపుల్ని బీసీలో చేర్చే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. పోలీసులు కాల్పులు జరిపితే శవాలతో నైనా రోడ్డుపై బైఠాయిస్తానని ప్రకటించారు. రిజర్వేషన్లు ప్రకటించే వరకు ఇక్కడేనన్నారు. ఈ దశలో రోడ్డుపై బైఠాయించిన యువకులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్, ఓట్లు మావీ, అధికారం మీదా, ఇది ఆకలి పోరాటం, ఆఖరి పోరాటం అంటూ నినాదాలు చేశారు. రాత్రి దాకా కొనసాగిన ఆందోళన రాత్రి పొద్దుపోయే వరకు ఆందోళన కొనసాగింది. ఈలోపు ఆందోళనకారులు ఆగ్రహావేశాలతో తుని రూరల్, టౌన్ పోలీసు స్టేషన్లకు నిప్పు బెట్టారు. పోలీసు వాహనాలతో పాటు అక్కడ పార్క్ చేసిన ప్రైవేటు వాహనాలు సైతం దగ్ధమయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు తునిలో అక్కడక్కడా ఫ్లెక్సీలకు నిప్పుపెట్టారు. దీంతో భీతావహులైన వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. పరిస్థితి చేజారిపోతుండడంతో పోలీసులు తుని ప్రాంతానికి అదనపు బలగాలను రప్పించారు. నేటి సాయంత్రం వరకు గడువు ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ముద్రగడ రాత్రి 9.30గంటల ప్రాంతంలో ప్రకటించారు. సోమవారం సాయంత్రంలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే తిరిగి ఆమరణ దీక్ష మొదలుపెడతానని ముద్రగడ ప్రకటించారు. ఇది ప్రభుత్వానికి అల్టిమేటమ్ అన్నారు. అప్పటికే రోడ్డుపై బైఠాయించి, వంటావార్పు మొదలు పెట్టిన యువకులు ముద్రగడ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
'బాబు మళ్లీ అలాంటి ప్రేలాపనలే పేలుతున్నారు'
తుని: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం వల్లే తూర్పు గోదావరి జిల్లా తుని కాపు గర్జనలో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన విధంగా స్పందించలేదని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలు బాధ కలిగిస్తున్నాయని, హింస వల్ల ఉద్యమం, ఉద్యమ లక్ష్యం దెబ్బతింటాయన్నారు. హింసాత్మక ధోరణిని విడిచి పెట్టాలని అంబటి పిలుపునిచ్చారు. ఉద్యమంలో కొన్ని దుష్టశక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని, నేటి ఘటనకు టీడీపీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని అంబటి డిమాండ్ చేశారు. బహిరంగ సభ జరుగుతుందని తెలిసినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తారో, లేదో చెప్పకుండా ప్రతిపక్ష పార్టీపై బురదజల్లడం ఎందుకు అన్నారు. గతంలో రైతుల ప్రయోజనాలను కాపాడమంటే రాజధానికి వ్యతిరేకమన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎందకు కట్టరని అడిగితే పట్టిసీమకు వ్యతిరేకం అన్నారు.. ఇప్పుడు అలాంటి ప్రేలాపనలనే పేలుతున్నారంటూ టీడీపీ సర్కార్ పై అంబటి మండిపడ్డారు.