టీడీపీ నేతల గురించి అలా అనలేదు: మంత్రి నారాయణ
విజయవాడ: టీడీపీలోని అందరు నేతలతోనూ తాను మంచి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనలో టీడీపీ నేతలు ఉన్నట్లు తాను చెప్పలేదని మంత్రి అన్నారు. రోడ్ల విస్తరణ కారణంగా 1000 ఇళ్లను తొలగించాల్సి ఉందని.. ఈ నెల 15వ తేదీలోగా మాస్టర్ల ప్లాన్ పూర్తి అవుతుందని తెలిపారు. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్, మాస్టర్ ప్లాన్ కు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు 13 గ్రామాల్లో పర్యటించి ఇళ్లు కోల్పోతున్నవారిలో 90 శాతం మందికి నచ్చజెప్పినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ ఖారారయిన తర్వాతే ఇళ్ల తొలగింపు చేపడతామని నారాయణ పేర్కొన్నారు. ఇళ్లను తొలగిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆర్కే ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. చెప్పని మాటలు ప్రచారం చేయడం సమంజసం కాదని చెప్పారు. ఒక వర్గానికి తనను దూరం చేసేందుకే తనపై దుష్రచారం చేస్తున్నారంటూ మంత్రి నారాయణ మండిపడ్డారు.