కాపు జాతికి న్యాయం కోసమే దీక్ష: ముద్రగడ
* భార్యతో కలసి శుక్రవారం ఉదయం 9 గంటలకు దీక్ష ప్రారంభం
* డిమాండ్లు సాధించేవరకు వెనుదిరిగేది లేదన్న ముద్రగడ... నిరాహార దీక్ష విషయంలో ఎలాంటి మార్పూ లేదని ప్రకటన
* జాతి కోసం సహధర్మచారిణితోపాటు జీవితం అంకితమిస్తానని వెల్లడి
* మధ్యాహ్నం భోజనం మానేసి ఖాళీ కంచాలతో నిరసనలకు పిలుపు
* దీక్షపై పోలీసుల ఉక్కుపాదం
* జిల్లాయేతరులు తూర్పుగోదావరిలో ప్రవేశించొద్దన్న ఎస్పీ.. జిల్లావాసులు కూడా కిర్లంపూడికి వెళ్లొద్దని సూచన
(కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జీవిత భాగస్వామి పద్మావతితో కలిసి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
కాపు జాతికి న్యాయం కోసమే దీక్ష: ముద్రగడ
కాపు జాతికి న్యాయం చేయడం కోసమే దీక్ష చేపడుతున్నట్లు ముద్రగడ చెప్పారు. తాను కొత్త డిమాండ్లేమీ పెట్టలేదని, గొంతెమ్మ కోర్కెలేవీ కోరడం లేదని, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లే నెరవేర్చాలని కోరుతున్నానని చెప్పారు. ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూడకుండా దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు.
డిమాండ్లు సాధించేవరకు వెనుదిరిగే ప్రసక్తే లేదని పద్మనాభం అన్నారు. డిమాండ్లను పరిష్కరించే ప్రతిపాదనలతో వస్తే పరిశీలించి తాను తృప్తి చెందితే దీక్ష విరమిస్తానని చెప్పారు. తన దీక్షకు అడ్డుతగలవద్దని తనతో చర్చలకు వచ్చిన వారిని కోరానన్నారు. గత నెల 31న జరిగిన విధ్వంసంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలనీ, అవసరమైతే సీబీఐ చేత విచారణ చేయించాలని కోరినట్లు ముద్రగడ చెప్పారు.
కాపు జాతి ప్రయోజనాల కోసం తాను... తన శ్రీమతి పద్మావతి జీవితం అంకితమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేసే అంశంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు. దీక్ష చేపడుతున్న తనకు మద్దతు తెలిపే ఉద్దేశంతో పెద్దసంఖ్యలో రావడం వల్ల మరోసారి అసాంఘిక మూకలకు అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. ఇది ఆఖరి పోరాటమనీ, ఎవరూ ఆవే శపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. కాకినాడలో జరిగిన సోదరుడి ఆత్మహత్య సంఘటనల వంటివి పునరావృతం కారాదన్నారు.