ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమ నేతగా చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టారు. అదే సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ముద్రగడ కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేశారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కూడా ఆయన్ను అవమానించారు. పవన్‌ను వెనకనుంచి ఆడిస్తున్నది చంద్రబాబే అన్నది ముద్రగడ అనుచరుల అనుమానం. అసలింతకీ ముద్రగడ, పవన్ మధ్య ఏం జరిగింది?
కాపు ఉద్యమ నేతగా.. తన సామాజిక వర్గం హక్కుల కోసం గత టీడీపీ పాలనలో అలుపెరుగని పోరాటం చేశారు ముద్రగడ పద్మనాభం. రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న ముద్రగడ పద్మనాభం కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాలతో పాటుగా.. కాపు ఉద్యమానికి కూడా దూరంగా ఉన్నారు. కాని కిర్లంపూడిలోని తన నివాసంలో ప్రజల్ని, అభిమానులను కలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది న్యూయర్ వేడుకలను తన అనుచరులతో కలిసి కిర్లంపూడిలో జరుపుకున్నారు. దీంతో ముద్రగడ తిరిగి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ముద్రగడతో పాటు ఆయన రెండవ కుమారుడు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని ఆయన అనుచరులు భావించారు. దీంతో ముద్రగడను తమ పార్టీలో చేర్చుకుంటే పార్టీకి మైలేజ్ వస్తుందని భావించిన జనసేన నేతలు కిర్లంపూడికి క్యూలు కట్టారు.
గత నెలలో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటుగా కొందరు స్ధానిక నాయకులు రెండు పర్యాయాలు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్ళారు. జనసేనలో చేరాలంటూ ముద్రగడను కోరారు. అంతేకాదు..తమ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే కిర్లంపూడి వచ్చి మిమ్మల్ని కలుస్తారని ముద్రగడకు తెలియచేశారు. దీంతో పవన్ తన నివాసానికి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తానని ముద్రగడ కూడా జనసేన నాయకులకు చెప్పారు. ఈ పరిణామాలతో ముద్రగడ జనసేనలో చేరుతున్నారంటూ ప్రచారం సాగింది. ముద్రగడ చేరికతో జనసేన బలపడుతుందన్న చర్చ కూడా నడిచింది. ఐతే రోజులు గడుస్తున్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం ముద్రగడ నివాసానికి వెళ్ళలేదు.
ఈ ప్రతిష్టంభనకు తెర తీసారు పవన్ కళ్యాణ్. కొద్ది రోజుల క్రిందట రాజమండ్రి వెళ్ళిన పవన్ కళ్యాణ్ కొన్ని నియోజకవర్గాలపై సమీక్షలు చేశారు. తర్వాత రాజమండ్రి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళిపోయారు. రాజమండ్రి నుండి పవన్ కళ్యాణ్ కిర్లంపూడికి వస్తారని ముద్రగడ, ఆయన అనుచరులు ఎదురు చూశారు. కానీ పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్ళి ఆయనతో సమావేశమయ్యేందుకు ఆసక్తి చూపలేదు.
జననేత నేతలు చెప్పినదాన్ని బట్టి పవన్ వస్తారని ముద్రగడ భావించారని..కాని పవన్ కళ్యాణ్ ముద్రగడను అవమానించారని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పవన్ రాజమండ్రి వచ్చి వెళ్లిపోయిన విషయం తెలిసిన ముద్రగడ ఆయనపై ఆసక్తికరమైన వాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇంటికి వచ్చిన జనసేన నేతలకు చెప్పాల్సింది చెప్పామని..ఇక మనం చేసేది ఏమీలేదని కామెంట్ చేశారట ముద్రగడ. పవన్ తన ఇంటికి వస్తే ఒక నమస్కారం.. రాకపోతే రెండు నమస్కారాలు అంటూ సెటైర్లు వేశారట ముద్రగడ.
ఇటీవల అనకాపల్లి పర్యటనలో పవన్ కళ్యాణ్.. కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లిన విషయం.. పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ నివాసానికి వెళ్ళిన విషయం ముద్రగడకు తెలిసింది. ఈ పరిణామాలు ముద్రగడ శిబిరంలో మరింత కాకరేపాయి. పవన్ ఉద్దేశపూర్వకంగానే ముద్రగడను అవమానిస్తున్నారన్న భావన వారిలో కలిగింది. ఎందుకంటే.. ఆమధ్య వారాహి పేరుతో తయారుచేయించుకున్న లారీ మీద యాత్ర చేసిన పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో ముద్రగడపై పరోక్షంగా విమర్శలు చేశారు.
దీంతో ముద్రగడ కూడా అంతే ధీటుగా స్పందించి పవన్ కు లేఖ రాశారు. ముద్రగడ లేఖను జీర్ణించుకోలేని జనసేన నాయకులు సోషల్ మీడియా వేదికగా ముద్రగడను అవమానించారు. ఐనప్పటికీ గత నెలలో జనసేన నేతలు ముద్రగడ నివాసానికి వెళ్ళినప్పుడు ముద్రగడ వారిని సాదరంగా ఆహ్వనించారు. ఇక ముద్రగడను జనసేనలో చేరకుండా అడ్డుపుల్ల వేసింది చంద్రబాబే అని ముద్రగడ అనుచరులు అనమానిస్తున్నారు.
ఇదీ చదవండి: బానిసిజానికి సరికొత్త అర్థం చెప్పిన ‘దత్తపుత్రుడు’
Comments
Please login to add a commentAdd a comment