నా జాతి కోసం ఏమైనా చేస్తా: ముద్రగడ
కాకినాడ: కాపు గర్జన ఉద్యమం తీవ్రరూపం దాల్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆమరణ దీక్ష ప్రారంభించనున్నట్లు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనతో పాటు భార్య కూడా ఈ ఆమరణ దీక్షలో కూర్చోనున్నట్లు వెల్లడించారు.
కాపులకు రిజర్వేషన్ల సాధనే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. తన కాపు జాతి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ముద్రగడ వివరించారు. తనతో చర్చించడానికి ఎవరైనా వస్తే అందుకు తాను సిద్ధమని.. అయితే, కాపులకు న్యాయం జరుగుతుందని భావిస్తే మాత్రమే చర్చల్లో పాల్గొంటానని ముద్రగడ పద్మనాభం వివరించారు.