ఆమరణ దీక్ష ప్రారంభించిన ముద్రగడ దంపతులు
కిర్లంపూడి: ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ప్రభుత్వం మోసం చేస్తోందని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. తుని ఘటన నేపథ్యంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గురువారం తన నివాసంలో సతీమణితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ అరెస్ట్ల పర్వం చాలా బాధాకరమన్నారు. ఆగస్టులోపు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారని, ప్రతి ఏటా వెయ్యికోట్లు బడ్జెట్లో పెడతామని కూడా హామీ ఇచ్చారన్నారు.
అలాగే తుని ఘటనలో కేసులను ఉపసంహరిస్తామన్నారని ముద్రగడ గుర్తు చేశారు. ఈ హామీలను ప్రభుత్వం తుంగలోకి తొక్కిందన్నారు. ఈ అరెస్ట్ల పర్వం చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. రౌడీ షీటర్లు అని ముద్రవేసి అరెస్ట్లు చేయడం సరికాదని అన్నారు. కాపు రిజర్వేషన్లతో పాటు, అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. అరెస్ట్ల పర్వం ఆపాలంటే ప్రాణత్యాగం తప్ప తనకు రెండోదారి లేదని ముద్రగడ పేర్కొన్నారు. తనను కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, అందుకు భయపడేది లేదన్నారు.
తనపై కేసులు పెట్టిన ఘటన చంద్రబాబుదేనని, తాను వెనక్కి తగ్గేది లేదని ముద్రగడ అన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అరెస్ట్ చేసుకోవచ్చన్నారు. కాపులను బీసీల్లో చేర్చుతామని గతంలో మాట ఇచ్చి దీక్షను విరమింప చేశారన్నారు. కాపు జాతి హక్కుల కోసం పోరాడటం తప్పా అని ఆయన ప్రశ్నించారు. జీవితం అంతా జైల్లో ఉండేలా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. ఒకవేళ తనను జైల్లో పెట్టినా దీక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు.
అరెస్ట్లకు భయపడి దాక్కోవడం కానీ, ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం జరగదన్నారు. తమ జాతి కోసం ప్రాణ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తన జాతి కోసం ప్రాణాలు అర్పించే అవకాశం ఇచ్చిన సీఎంకు ముద్రగడ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనను అరెస్ట్ చేయకుండా... తన జాతి కోసం మరణం పొందే అవకాశం ఇవ్వాలని ఆయన సీఎంను కోరారు. అలాగే ఇదే ఆఖరి ప్రెస్మీట్ అని, దయచేసి మాట్లాడేందుకు ప్రయత్నించవద్దని ముద్రగడ ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను కోరారు.