పోలీసు దిగ్బంధంలో తుని | police batallions take tuni situation into their control | Sakshi
Sakshi News home page

పోలీసు దిగ్బంధంలో తుని

Published Mon, Feb 1 2016 8:21 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

పోలీసు దిగ్బంధంలో తుని - Sakshi

పోలీసు దిగ్బంధంలో తుని

కాపు ఉద్యమం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతంలో పోలీసులు మోహరించారు. ప్రధాన కూడళ్లతో పాటు బస్టాండు, రైల్వేస్టేషన్ లాంటి ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తునితో పాటు విశాఖపట్నంలో కూడా 144 సెక్షన్ అమలవుతోంది. సోమవారం ఉదయానికి ఉద్రిక్తత కొంతవరకు సడలింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉద్యమానికి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ఆదివారం రాత్రి 9.30 సమయంలో ముద్రగడ పద్మనాభం ప్రకటించడంతో.. ఆ తర్వాతి నుంచి ఎలాంటి ఘటనలు జరగలేదు. ప్రస్తుతం పరిస్థితి మాత్రం పూర్తిగా అదుపులోనే ఉంది.

కాపులను బీసీలలో చేరుస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వాలని డిమాండ్ చేసిన ముద్రగడ పద్మనాభం.. సోమవారం సాయంత్రం వరకు సర్కారు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోతే ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. అయితే ఆయన దీక్ష ఎక్కడ చేస్తారో తెలియక పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం తన స్వగ్రామమైన కిర్లంపూడిలో ఉన్నారు. పరిసర ప్రాంత వాసులతో పాటు పలు జిల్లాల నుంచి వచ్చిన కాపు నాయకులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఆదివారం నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ఆయన తన ఇంట్లోనే దీక్ష చేయొచ్చని భావిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కాగా, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ బోగీల దగ్ధం లాంటి ఘటనల వల్ల విశాఖ, తుని నుంచి రైళ్లు ఇప్పటికీ కొంత ఆలస్యంగానే నడుస్తున్నాయి. దాంతో ప్రయాణికులకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement