ముద్రగడ పాదయాత్రపై ప్రత్యేక నిఘా..
హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ కెమెరాలు
హైదరాబాద్ : నిన్నటి వరకు ఉప్పు-నిప్పులా ఉన్న తెలంగాణ-ఏపీ పోలీసులు ఇప్పుడు పరస్పరం సహకరించుకుంటున్నాయి. కీలక సందర్భాల్లో భద్రత, బందోబస్తు ఏర్పాట్ల అంశంలో కలిసి పని చేస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రపై నిఘా ఉంచడానికి అవసరమైన బాడీ వార్న్ కెమెరాలను (చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు) హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అందించారు.
ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు సాగే ముద్రగడ పాదయాత్రలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం ఉందంటూ ఏపీ పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రతి దశలోనూ పాదయాత్రపై గట్టి నిఘా ఉంచేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు వినియోగిస్తున్న 25 బాడీ వార్న్ కెమెరాలను తాత్కాలిక ప్రాతిపదికన అందించాల్సిందిగా ఆ జిల్లా ఎస్పీ కోరారు. సానుకూలంగా స్పందించిన నగర ఉన్నతాధికారులు 25 కెమెరాలతో పాటు వీటి వినియోగంలో శిక్షణ ఇవ్వడానికి, పర్యవేక్షించడానికి ఇద్దరు అధికారుల్నీ అక్కడకు పంపారు. అధికారులు, బాడీ వార్న్ కెమెరాలతో సోమవారం కాకినాడ చేరుకున్నారు.