ఇంట్లోకి వచ్చారో పురుగు మందు తాగుతా: ముద్రగడ
కిర్లంపూడి : ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో ఆగ్రహించిన ముద్రగడ ఇంటి లోపలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. పురుగు మందు డబ్బా చూపిస్తూ... దాన్ని తాగుతానని హెచ్చరికలు చేశారు.
కాపు జాతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని అన్నారు. కాపుల రిజర్వేషన్లు అమలు చేయమంటే అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ అయ్యేందుకు తాను సిద్ధమే అని, అయితే అందుకు సరైనా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తన ఇంటి వద్ద నుంచి పోలీసులు తక్షణమే వెళ్లిపోవాలని సూచించారు. తమ జీవితాలతో ఆడుకోవద్దని వార్నింగ్ ఇవ్వడంతో, పోలీసులు వెనక్కి తగ్గారు.
దీంతో ముద్రగడ అరెస్ట్ను పోలీసులు తాత్కాలికంగా విరమించుకున్నారు. ఈ సందర్భంగా ముద్రగడతో పాటు దీక్షకు దిగిన ఆయన సతీమణి ఆందోళనకు గురై, కంటతడి పెట్టారు. ఆమెను ముద్రగడ ఏంకాదంటూ అనునయించారు. అలాగే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కూడా ముద్రగడ నిరాకరించారు.
కాగా ముద్రగడ నివాసం వద్ద ఉన్న మీడియాను పోలీసులు పంపించి వేశారు. మరోవైపు డీఐజీ రామకృష్ణ కిర్లంపూడి చేరుకున్నారు. మరోవైపు ముద్రగడ నివాసానికి కాపులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.