కదం తొక్కిన ఏఐవైఎఫ్ శ్రేణులు
ఏలూరు (సెంట్రల్): దేశంలో విద్యా, వైద్య, ఉపాధి రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని, యువత దృష్టిని ఈ అంశాల నుంచి మరల్చడానికి దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలపై హిందూత్వ వాదులు దాడులు చేస్తున్నారని అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర 20వ మహాసభలు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.లెనిన్‌బాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో తిరుమలై మాట్లాడారు.
ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు యువత పోరాడాలని పిలుపునిచ్చారు. మైనార్టీలపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ నోరు విప్పడం లేదని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం యువత కీలక నిర్ణయాలు తీసుకోవాలని, ఆ దిశగా పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ముందుగా స్థానిక టూబాకో కల్యాణ మండపం నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సంగీత దర్శకుడు వందేమాతం శ్రీనివాస్ సభ ప్రాంగణం వద్ద విప్లవ గేయాలను ఆలపించారు. ఏఐవైఎఫ్ నాయకులు ఐ.బయ్యన్న, బొద్దాని నాగరాజు, బి.కష్ణకిషోర్, యు.హేమశంకర్, ఎం.సుబ్బారావు, జె.విశ్వనాథ్, రెడ్డి శ్రీనివాస్, డాంగే ప్రజా నాట్యమండలి నాయకులు ఎం.గని, చంద్రానాయక్ పాల్గొన్నారు.