ఆనందమానందమాయే..!
– గౌతమీతీరాన గోకులం
రాజమహేంద్రవరం కల్చరల్ : ధర్మసంస్థాపనకు ద్వాపర యుగంలో అవనిపై అవతరించిన గోపాలుని జన్మదిన వేడుకలు అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్యసంఘం ఆధ్వర్యంలో ఆదివారం గౌతమఘాట్‌లోని రాధాగోపీనాథ్ దశావతార్ మందిరంలో ఘనంగా జరిగాయి. శ్రావణ బహుళ అష్టమి నడిరేయి దేవకీదేవి గర్భాన జనించిన నల్లనయ్య తెల్లవారేసరికి రేపల్లెలోని యశోదమ్మ ఇంటికి చేరుకున్నాడు. ‘ఏమినోము ఫలమొ–ఇంతపొద్దొక వార్తవింటిమ బలలార వీనులల–మన యశోద చిన్నిమగవాని గనెనట–చూచివత్తమ్మ సుదతులార’ అని రేపల్లెవాసులు ఆనందభరితులయ్యారు. ఆ మధుర క్షణాలు తిరిగి మంగళవారం పునరావృతమయ్యాయి....
ఇస్కాన్‌లో భక్తజనందోహం
ఉదయం 4.30 గంటలకు స్వామికి మహామంగళహారతి, 7.30 గంటలకు శృంగార హారతి పూర్తయ్యాక, భక్తులను కృష్ణపరమాత్మ దర్శనానికి అనుమతించారు. హరేకృష్ణనామస్మరణతో వేలాది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఆలయంలోని రాధాకృష్ణులు, జగన్నాథ సుభద్రాబలదేవులు, వేంకటేశ్వరస్వామి మూర్తులకు విశేష అలంకరణలు చేశారు.
శరీరమే నిజమైన నేస్తం
దురలవాట్ల దూరంగా ఉంటే శరీరమే మనకు నిజమైన నేస్తమవుతుందని ఇస్కాన్ నగరాధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్ వెల్లడించారు. సన్నిహితమైన శ్రేయోభిలాషి గురువు, ప్రియాతిప్రియమైన వ్యక్తి భగవంతుడు, ప్రకృతి అంతా భగవంతుని ప్రసాదమేనని ఆయన భాగవతప్రవచనంలో పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి మనం కొన్ని గేలన్ల నీరు తాగి ఉంటాం, ఆ నీటిని మనకు అనుగ్రహించిన భగవంతుని పట్ల కృతజ్ఞత లేకుండా జీవించడమే మహాపాపమని ఆయన అన్నారు.
బహుమతిప్రదానం
ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన వివిధ సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. వివిధ విద్యాసంస్థల నుంచి 3,500మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 251మందికి సర్టిఫికెట్, జ్ఞాపికలను అందజేశారు. ఇస్కాన్ నగరాధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్, నగరమేయర్ పంతం రజనీశేషసాయి తదితరులు హాజరయ్యారు.