- ఆగస్టు 29న పోలింగ్ –1న ఫలితాలు
- 7 నుంచి పది వరకు నామినేషన్లు
- విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్
కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగింది. ఏడేళ్ల విరామం అనంతరం కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఊహించని విధంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఒక్కసారిగా అన్ని రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి రాజుకుంది. మరో మూడు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. నెలాఖరులోగా అన్ని ప్రక్రియలు పూర్తి చేసి సెప్టెంబర్ 1వ తేదీన ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
ఏడేళ్ల అనంతరం ఎన్నికలు...
మున్సిపాలిటీగా ఉన్న కాకినాడను 2005లో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. అదే ఏడాది అక్టోబర్ 1న కార్పొరేషన్ తొలిపాలక వర్గం బాధ్యతలు చేపట్టింది. 2010 సెప్టెంబర్ 30తో పదవీకాలం కూడా ముగిసిపోయింది. కాంగ్రెస్ హయాంలోను, ప్రస్తుత టీడీపీ పాలనలోను ఇక్కడ ఎన్నికలు జరిపేందుకు సాహసం చేయలేక కుంటిసాకులతో వాయిదాలు వేస్తూ వచ్చారు.
రాజకీయ కోణంలో వెనక్కి...
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాజకీయకోణంలోనే ఇక్కడి ఎన్నికలను చూడడంతో దాదాపు ఏడేళ్లుగా ప్రజలకు ప్రత్యేకాధికారి పాలనే దిక్కయింది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత వల్ల ఓటమి భయంతో రెండు ప్రభుత్వాలు ఎన్నికలకు ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవిగో ఎన్నికలంటే, అవిగో ఎన్నికలంటూ కాలయాపనతోనే మూడేళ్ళుగా రోజులు గడిపేశారు.
మారని డివిజన్లు...
తొలి కార్పొరేషన్ ఎన్నికల్లో ఉన్న 50 డివిజన్లతోనే ఇప్పుడు కూడా ఎన్నికలు జరపనున్నారు. అయితే మరోసారి వార్డుల పునర్విభజన జరగడంతో హద్దులు మారి రిజర్వేషన్లలో కూడా చాలా మార్పులు వచ్చాయి.
మహిళలకు 50 శాతం...
ప్రస్తుత ఎన్నికల్లో 50 శాతం మహిళలకు కార్పొరేటర్ సీట్లు కేటాయించనున్నారు. మహిళలకు సంబంధించి రెండు ఎస్సీ, ఎనిమిది బీసీ, 15 జనరల్ కోటాలోను పోటీ చేయనున్నారు. ఆ మేరకు రిజర్వేషన్లను కూడా నిర్ధారిస్తూ పురపరిపాలన శాఖ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల షెడ్యూల్...
ఆగస్టు 7–10 నామినేషన్లు
ఆగస్టు 11 నామినేషన్ల పరిశీలన
ఆగస్టు 16 నామినేషన్ల ఉపసంహరణ
ఆగస్టు 29 ఎన్నికల పోలింగ్
ఆగస్టు 31 అవసరమైనచోట్ల రీ పోలింగ్
సెప్టెంబర్ 1 కౌంటింగ్, ఫలితాలు
కాకినాడ కార్పొరేషన్ ప్రొఫెల్...
మొత్తం డివిజన్లు 50
కార్పొరేషన్ ఓటర్లు 2,37,844
బీసీ ఓటర్లు 1,22,782
ఎస్సీలు 19,484
ఎస్టీలు 594
రిజర్వేషన్ల కేటాయింపు...
బీసీలకు 17
ఎస్సీలకు 4
ఎస్టీ 1
మహిళలు (జనరల్) 15
అన్‌రిజర్వ్‌డ్ (జనరల్) 13