టీడీపీ నేతల గుండెల్లో గుబులు | kakinada corporation elections | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల గుండెల్లో గుబులు

Published Sat, Aug 5 2017 11:21 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

టీడీపీ నేతల గుండెల్లో గుబులు - Sakshi

టీడీపీ నేతల గుండెల్లో గుబులు

– ఎన్నికలంటేనే హడలెత్తిపోతున్న పరిస్థితి 
– ఎన్నికను వాయిదా వేయించేందుకు విశ్వ ప్రయత్నాలు 
– ఫలించని పన్నాగం 
- ఎన్నికల కమిషన్‌ నిర్ణయంతో కంగుతిన్న నేతలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పరిస్థితులు ఎక్కడా సానుకూలంగా లేవు. ప్రజావ్యతిరేకత రోజురోజుకీ ఎక్కువవుతోంది. అభివృద్ధి లేదు సరికదా అవినీతి పెరిగిపోయిందని ప్రజలు అంతెత్తున లేస్తున్నారు. దొరికినకాడికి దోచుకుంటుండడంతో మండిపడుతున్నారు. మోసపూరిత హామీలిచ్చి మోసగించారన్న ఆవేదనతో ప్రజానీకం ఉంది. అధికార పార్టీపై ఎక్కడ చూసినా అసంతృప్తే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలంటే ఆ పార్టీ నేతలే భయపడిపోతున్నారు. ఎలాగోలా ఎన్నిక గండం నుంచి గట్టెక్కాలన్న ఉద్దేశంతో పన్నాగం పన్నుతున్నారు. ఏదో ఓ కారణం చూపించి ఎన్నికలను వాయిదా వేయించేందుకు యత్నించినా ఫలించడం లేదు. న్యాయస్థానాలు అంగీకరించకపోవడంతో కొంతమంది టీడీపీ నేతలు చేసిన కుయుక్తులు బోర్లాపడ్డాయి. 
చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనతో పోల్చి రూస్తే అవినీతి స్వైర విహారం చేస్తోంది ... అభివృద్ధి జాడే లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వాటి కోసం అడుగుతున్న వారిపై కేసులు పెడుతున్నారు. రకరకాలుగా వేధిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులగా చిత్రీకరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా కాపులనే తీసుకోవచ్చు. బీసీలో చేర్చాలని ఉద్యమం చేస్తుంటే ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడిది కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో తీవ్ర చర్చనీయాంశమయింది. టీడీపీ అంటేనే కాపులు మండిపడిపోతున్నారు. మోసగించడమే కాకుండా నానా రకాలుగా హింసిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. 
- జన్మభూమి కమిటీల పెత్తనమైతే అంతా ఇంతా కాదు. కమిటీ సభ్యుల ఆగడాలు పెచ్చుమీరిపోయి కార్పొరేషన్‌లోని ప్రతి డివిజన్‌లోనూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, తదితర సంక్షేమ కార్యక్రమాలన్నీ పచ్చచొక్కాలకే తప్ప అర్హులకు ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల జన్మభూమి కమిటీ సభ్యులే తమ భార్యల పేరిట వితంతు పింఛన్లు మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయి. 
- ఇక  హౌసింగ్‌ పేరిట అక్రమాలకు పాల్పడ్డారు. స్థలం, మంజూరు లేకుండానే ఇళ్లు ఇస్తామంటూ లబ్ధిదారుల చేత డీడీలను కట్టించడమే కాకుండా పెద్ద ఎత్తున పర్సంటేజీలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 
- మూడేళ్ల పాలనలో కాకినాడ నగర పరిస్థితి అధ్వానంగా తయారైంది. పారిశుద్ధ్య పరిస్థితులు దారుణంగా ఉండటంతో ఎక్కడికక్కడ వ్యాధులు ప్రబలుతున్నాయి. రోగాల బారిన పడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.  దీంతో ప్రజల్లో ఎక్కడ చూసినా వ్యతిరేకతే కనబడుతోంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేసి తప్పు చేశామని, బుద్ధి చెప్పేందుకు మళ్లీ ఎన్నికలెప్పుడొస్తాయా? అని నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ ఎన్నికలు వచ్చేశాయి. కోర్టు ఆదేశాలతో ఏడేళ్ల విరామం అనంతరం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పుడిది టీడీపీలో గుబులు రేపుతోంది. 
ఎన్నికల వాయిదా వేయించేందుకు యత్నాలు 
ప్రజల నాడిని గమనించిన టీడీపీ నేతలు డైలామాలో పడ్డారు. అకస్మికంగా వచ్చిన నోటిఫికేషన్‌ చూసి కలవరపడ్డారు. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే గట్టెక్కలేమన్న భయం పట్టుకుంది. దీంతో ఎలాగైనా ఎన్నికలు వాయిదా వేయించాలన్న ఆలోచనకు వచ్చి రకరకాల పిటీషన్లు కోర్టులో వేయిస్తున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్‌ సరిగా పాటించలేదని కొందరి చేత పిటీషన్‌ వేయించారు. ఎస్సీల రిజర్వేషన్‌ కూడా సరిగా లేదనే పిటీషన్‌ వేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు కోర్టులో పిటీషన్లు వేయిస్తూనే మరోవైపు అధికారుల చేత రకరకాల వాదనలు విన్పిస్తున్నారు. ముఖ్యంగా కోర్టు తాజా ఆదేశాల ప్రకారం రెండు డివిజన్లు (42,48) వదిలేసి మిగతా డివిజన్‌లలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అదెలా సాధ్యమంటూ అధికారుల చేత అభ్యంతరం తెలిపే ప్రయత్నం చేయిస్తున్నారు. ఆ రెండు డివిజన్‌లను వదిలేసి ఎన్నికలు నిర్వహిస్తే వాటి పరిస్థితేంటనే అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నెలకున్న సందిగ్ధం నేపథ్యంలో  ప్రభుత్వ స్థాయిలో  కూడా అధికారులపై ఒత్తిడి చేయించారన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయన్న సమాచారాన్ని శుక్రవారమైతే మెసెజ్‌ల రూపంలో పలువురు నేతలు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఎటువంటి భయం వద్దని...ఎన్నికలు వాయిదా పడతాయని...ధీమాగా ఉండొచ్చని  ఓ నేత ద్వారా విస్తృతంగా మెసెజ్‌లు వెళ్లినట్టు నగరంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఎన్ని చేసినప్పటికీ అటు కోర్టులు, ఇటు ఎన్నికల సంఘం ఎలాగైనా ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబట్టడంతో టీడీపీ నేతలు షాక్‌ తిన్న పరిస్థితి నెలకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement