గెలుపు గుర్రాల కోసం పాట్లు
కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల కోసం వెదుకులాట
వైఎస్సార్‌సీపీ వారిని ఆకర్షించేందకు యత్నాలు
కాకినాడ రూరల్: ఏడేళ్ల తరువాత కాకినాడ కార్పొరేషన్‌కు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతోపాటు రిజర్వేషన్లు ఖరారు కావడంతో గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల నాయకులు పడుతున్న పాట్లు అన్నీ, ఇన్నీ కావు. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు అభ్యర్థులు కరువవ్వయడంతో ఆ పార్టీలకు అభ్యర్థులను నియమించడం తలకు మించిన వ్యవహారంగా కన్పిస్తోందని ఆ పార్టీలకు చెందిన నాయకులే చెబుతుండడం గమనార్హం. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నుంచే టీడీపీకి గట్టి పోటీ ఎదురుకావడంతో కుటిల రాజకీయం చేసే దిశగా టీడీపీ నాయకులు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌కు పాలకవర్గం లేకపోవడం, ఇప్పటికిప్పుడే ఎన్నికలు రావని, దర్జాగా మరో రెండేళ్లు పాటు కార్పొరేషన్‌పై తామే అధికారం చెలాయిద్దామనుకున్న సిటీ, రూరల్ నియోజకవర్గాల ప్రతినిధులకు ఎన్నికల ప్రకటనతో గొంతులో వెలకాయపడినట్లయింది.
వైఎస్సార్‌సీపీ నాయకులకు గాలం
డివిజన్ల వారీగా పోటీలో నిలిపేందుకు టీడీపీకి బలమైన నాయకులు కన్పించకపోవడంతో వైఎస్సార్‌సీపీ నాయకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే 1, 2, 3, 47, 49, 50 డివిజన్లలో సరైన అభ్యర్థులు దొరక్కపోవడంతో టీడీపీ నేతలు బలంగా ఉన్న వైఎస్సార్ నాయకులపై దృష్టి పెట్టారు. ఇప్పటికే బంధువర్గాలను ఉపయోగించి నాయకులను ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీ తరపున పోటీ చేస్తే ఎన్నికల్లో ఖర్చంతా తామే పెడతామని టీడీపీ వర్గాలు భరోసా ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముందుకు రాని మహిళలు
ఇక కొన్ని డివిజన్ స్థానాలను బీసీ జనరల్‌కు, మరికొన్ని బీసీ మహిళలకు, కొన్ని ఎస్సీ వర్గాలకు కేటాయించినా వాటిలో పోటీ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. నగరపాలక సంస్థ మేయర్ పదవిని మహిళకు కేటాయించడంతో జనరల్ మహిళా, బీసీ మహిళా అన్నది తేల్చకపోవడంతో మహిళలు పోటీకీ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జనరల్ మహిళకు పదవిని కేటాయిస్తే నాయకుల భార్యలనే రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మేయర్ పదవిని ఆశిస్తున్న వారే అన్ని డివిజన్లలో తమకు అనుకూలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకొని గెలుపించుకునే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే ఎన్నిక అయ్యే అవకాశాలుండడంతో సమరోత్సాహంలో ఉన్న వైఎస్సార్‌సీపీ తరఫున నిలబడేందుకు పలువురు నాయకులు, కార్యకర్తలు ముందుకు వస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుల మేకపోతు గాంభీర్యం
రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌పార్టీని ప్రజలు తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి గ్రామస్థాయిలో జరిగిన ఎంపీటీసీ సభ్యుల్లో ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం ఇవ్వకపోవడంతో అంతర్మథనంలో పడిపోయిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ కార్పొరేషన్ ఎన్నికలకు తామూ సిద్ధమేనంటూ ప్రకటించారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన కొందరు ప్రధాన నాయకులు టీడీపీకి చెందిన నాయకులతో రహస్య మంతనాలు జరిపి వైఎస్సార్‌సీపీని దెబ్బకొట్టేందుకు పావులు కదుపుతున్నట్లు ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు.