కొండంత దన్నుతో బరితెగింపు | kakinada corporation land | Sakshi
Sakshi News home page

కొండంత దన్నుతో బరితెగింపు

Published Sun, Feb 12 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

కొండంత దన్నుతో బరితెగింపు

కొండంత దన్నుతో బరితెగింపు

దర్జాగా రూ.3 కోట్ల కార్పొరేషన్‌ స్థలం కబ్జా
కాకినాడలో ఓ ‘తెలుగు మహిళ’ ఆక్రమణ పర్వం
వాస్తు రీత్యా వదిలిన స్థలంలో ఏకంగా ఇళ్లే కట్టేస్తున్న వైనం
ముఖ్య నేత అండ ఉండడంతో నోరు మెదపని అధికారులు
స్మార్ట్‌ సిటీ అయ్యాక కాకినాడలో గజం స్థలం కూడా దొరకడం గగనమే అవుతోంది. అటువంటి పరిస్థితుల్లో నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాన్ని అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ తెలుగు మహిళ కబ్జా చేశారు. ‘కొండ’ంత అండ ఉండటంతో కార్పొరేషన్‌ అధికారులు కూడా ఆ కబ్జావైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేక మిన్నకుండిపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :  అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ‘కొండ’ంత దన్ను ఉండటంతో కాకినాడలో ఒక తెలుగు మహిళ కబ్జాలు చేయడంలో ‘తమ్ముళ్ల’ను కూడా మించిపోయింది. కబ్జా చేసిన స్థలంపై అధికారులెవరూకన్నెత్తి చూడకుండా ఉండేందుకు కొన్నేళ్లుగా ఉన్న రాజకీయ పార్టీనే విడిచిపెట్టేసి, తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె కబ్జా చేసిన స్థలం విలువ ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం రూ.3 కోట్లు పైనే ఉంది.
కాకినాడలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగో డివిజన్‌లోని భాస్కర్‌ నగర్‌ ప్రాంతమది. అక్కడ భారీ అపార్టుమెంట్లు, కోట్ల రూపాయల విలువైన భవంతుల నిర్మాణాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రాంతంలో స్థానికులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఓ పార్కు ఉంది. ఆ పార్కు ప్రాంతంలో అర ఎకరం భూమిని సాయిబాబా ఆలయ నిర్మాణానికి కేటాయించారు. సర్వే నంబర్‌ 18/1లో ఉన్న ఈ స్థలాన్ని 2006లో అప్పటి మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ బీరక చంద్రశేఖర్‌ హయాంలో సాయిబాబా ఆలయం నిర్మాణానికి కేటాయించారు. ఈ మేరకు ఆ స్థలాన్ని సద్గురు షిర్డీ సాయి భక్తజన సంక్షేమ సంఘానికి అప్పగించారు. సంఘం ఆధ్వర్యాన అప్పట్లో దాతల సహకారంతో సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరురాలైన ఓ మహిళ ఆ స్థలంలో పాకలు వేసింది. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో 2012లో మున్సిపల్‌ అధికారులు ఆ స్థలాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, మున్సిపాలిటీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆ స్థలాన్ని ఖాళీ చేయించారు. అప్పటినుంచీ ఆ స్థలం ఖాళీగా ఉండటంతో కబ్జా అవుతుందనే ఉద్దేశంతో అక్కడ పార్కు అభివృద్ధి చేస్తామని సాయిబాబా ఆలయ సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని ఆలయానికి అప్పగించారు. దాతల సహకారంతో సంఘ సభ్యులు సుమారు రూ.60 లక్షలు వెచ్చించి, పార్కును సుందరంగా తీర్చిదిద్దారు.
పార్కుకు ప్రహరీ నిర్మించి మిగిలిన 700 గజాల స్థలాన్ని ప్రహరీ బయట వాస్తు రీత్యా ఖాళీగా ఉంచారు. అక్కడ గజం రూ.40 వేలు పైనే పలుకుతోంది. అంత ఖరీదైన స్థలాన్ని ఖాళీగా ఉంచడమే పాపం అన్నట్టు ఇప్పుడు ఆ స్థలాన్ని తిరిగి ‘ఆమె’ కబ్జా చేసేసింది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆమె.. ఏడాది క్రితం టీడీపీలో చేరింది. కబ్జా స్థలాన్ని కాపాడుకోవడానికే ఇలా చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. నగరంలో ఆ పార్టీ ముఖ్యనేత దన్ను ఉండటంతో ఆమె కబ్జాను అడ్డుకున్నవారే లేకపోయారు. టీడీపీలో జన్మభూమి కమిటీ సభ్యురాలు కూడా కావడంతో.. కార్పొరేషన్‌ ప్రమేయం లేకుండానే 700 గజాల స్థలాన్ని ఆ తెలుగు మహిళ దర్జాగా కబ్జా చేసేసింది. అంతేకాకుండా ఆ స్థలంలో కార్పొరేషన్‌ అనుమతి లేకుండా గత నెల రెండో వారంలో రెండు పక్కా ఇళ్లు యుద్ధప్రాతిపదికన నిర్మించేశారు. ప్రస్తుతం మూడో ఇంటి నిర్మాణ ఏర్పాట్లలో ఉండగా స్థానికులు, సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు కార్పొరేషన్‌అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో బీచ్‌ ఫెస్టివల్‌ హడావుడిలో ఉండడంతో అధికారులు దీనిపై దృష్టి పెట్టలేదు. ఇదే అదునుగా బరితెగించిన ఆ తెలుగు మహిళ గడచిన కొద్ది రోజులుగా మరో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
దీనిపై స్థానికులు, ఆలయ కమిటీ చైర్మ¯ŒS పలకా శేఖర్‌ తదితరులు నిలదీసేందుకు వెళ్లగా, గొడవకు దిగడంతో వెనక్కు వచ్చేశారు. ఈ అంశాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని వారు విరమించుకున్నారు. దాతలు ముందుకు వచ్చారని, ఖాళీ స్థలంలో హెర్బల్‌ పార్క్‌ నిర్మిస్తామని ఆలయ కమిటీ సభ్యులు కార్పొరేషన్‌ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా.. అధికార పార్టీ ముఖ్యనేత అండ ఉండటంతో వారు పెదవి విప్పడంలేదు.
తహసీల్దార్‌ వివరణ కోరాం
భాస్కర్‌నగర్‌ పార్కు స్థలంలో రెండు షెడ్లు అక్రమంగా నిర్మించిన విషయం మా దృష్టికి వచ్చింది. మూడో షెడ్డు నిర్మాణం మా దృష్టికి రాలేదు. తనవద్ద తహసీల్దార్‌ ఇచ్చిన పట్టా ఉందని చెబుతున్నందున తహసీల్దార్‌ను వివరణ కోరాం. పట్టా లేకుంటే చర్యలు తీసుకుంటాం.
– కాలేషా, డిప్యూటీ సిటీప్లానర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement