'కన్యావందనం’
♦ చిలుకూరులో వైభవంగా ఉత్సవం
♦ చిన్నారుల కాళ్లకు పసుపు, పారాణి రాసిన అర్చకులు
‘నారీ సర్వజగన్మయి’ ఉద్యమంలో భాగంగా శుక్రవారం చిలుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ‘కన్యావందనం’ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. - మొయినాబాద్
మొయినాబాద్: ‘‘సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణి.. విద్యారంభం కరి శ్యామి.. సిద్ధిర్భవత్ మేషద’’ అంటూ అర్చకులు సరస్వతీ స్తోత్రం జపిస్తూ.. మహాలక్ష్మి ప్రతిరూపాలైన చిన్నారుల కాళ్లకు పసుపు పారాణి పూశారు. సమాజంలో ఆడపిల్లలను మహాలక్షీ్ష్మదేవిగా పూజించి, గౌరవించాలనే సంకల్పంతో ‘నారీ సర్వజగన్మయి’ ఉద్యమంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని చిలుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ‘కన్యావందనం’ కార్యక్రమాన్ని చేపట్టారు. వసంత పంచమి, చదువుల తల్లి సరస్వతీ దేవి పుట్టినరోజైన శుక్రవారం పాఠశాలలో 1,2వ తరగతి చదువుతున్న చిన్నారులను మహాలక్ష్మి దేవి ప్రతిరూపాలుగా అలంకరించారు. దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త, చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్, అర్చకుడు సురేష్ పసుపు పారాణి పూశారు. అనంతరం మంగళహారతి ఇచ్చి మహాలక్ష్మీదేవిగా పూజించారు. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందజేశారు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న మహాలక్ష్మి దినోత్సవంగా నిర్వహించాలని అర్చకుడు రంగరాజన్ అన్నారు. కన్యావందనం కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఆడపిల్లలపట్ల రోజురోజుకూ గౌరవం తగ్గుతోందని, వారిపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇవన్నీ రూపుమాపేందుకు మహాలక్ష్మి ఉత్సవాన్ని చేపట్టామన్నారు. మహాలక్ష్మి ప్రతిరూపమైన ఆడపిల్లలను గౌరవంగా చూడాలని, పూజించాలని చెప్పారు. చిలుకూరులో ప్రారంభించిన ఈ కార్యక్రమం అన్నిచోట్ల చేపట్టాలన్నారు. ప్రస్తుతం వెయ్యిమంది మగపిల్లలు పుడితే 950 మంది ఆడపిల్లలు పుడుతున్నారని, 50 మంది ఆడపిల్లలు గర్భంలోనే నులిమేయబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుట్టిన 950 మంది ఆడపిల్లలను కాపాడుకోవాలన్నారు. ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందనే భావన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య, ఈఓపీఆర్‌డీ సునంద, సర్పంచ్ గున్నాల సంగీత, ఉపసర్పంచ్ నర్సింహగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 14న మహాలక్ష్మి దినోత్సవంగా నిర్వహించాలి..