టీడీపీ దొంగ జపం | kapu card kakinada corporation elections | Sakshi
Sakshi News home page

టీడీపీ దొంగ జపం

Published Wed, Aug 9 2017 3:17 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

టీడీపీ దొంగ జపం - Sakshi

టీడీపీ దొంగ జపం

– తెరపైకి మళ్లీ కాపు మంత్రం 
– మేయర్‌ పీఠం కాపులకంటూ కుతంత్రం
–ఓ పక్క కాపులను తొక్కేస్తూ మరో పక్క బుజ్జగించే యత్నాలు 
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ మళ్లీ డ్రామాలాడుతోంది. 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక చేతులేత్తేసిన పచ్చపార్టీ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. గత మూడేళ్లుగా అణగదొక్కుతున్న కాపు నినాదాన్ని మళ్లీ  తెరపైకి తీసుకొస్తోంది. పసుపు నేతలకు రాజకీయాలు తప్ప విలువలు, నిజాయితీ లేదా అని జనాలు చీదరించే పరిస్థితి ఏర్పడింది.   
 
గడిచిన ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేర్చుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే కాపులను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తున్నారు. రిజర్వేషన్‌ కోసం పోరాడుతున్న కాపు నేతలపై కేసులు బనాయిస్తున్నారు. కాపు జాతికోసం చేస్తున్న ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాపులు రోడ్డుపైకి అడుగు పెడితే చాలు నిర్బంధం పెడుతున్నారు. పోలీసుల నిఘాలోనే కాపులు నిరంతరం గడుపుతున్నారు. అడుగడుగునా ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు నెలకున్నాయి.

ప్రస్తుతం జిల్లాలో కాపులపై అనుసరిస్తున్న తీరుపై ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. కాపులపై కక్షకట్టినట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. దీంతో టీడీపీ అంటేనే కాపులు రగిలిపోతున్నారు. చంద్రబాబు దగ్గరి నుంచి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల వరకు కాపుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో గెలిపించిన కాపులను అధికారంలోకి వచ్చాక హింసిస్తున్నారని ఆ జాతి అంతా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆ సామాజిక వర్గానికి పూర్తిగా దూరమైన పరిస్థితి ఏర్పడింది.  
 
 చక్కదిద్దేందుకు కాపు జపం
అసలే ప్రభుత్వంపై అసంతృప్తి...ఆపై కాపుల నుంచి వ్యతిరేకత...పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కాపు రిజర్వేషన్‌ కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభంపై అనుసరిస్తున్న తీరుతో కాపులంతా అంతెత్తున లేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతున్నారు. పరిస్థితిని ఎలా చక్కదిద్దాలా అన్న దానిపై తర్జనభర్జన పడి గడిచిన ఎన్నికల్లో గట్టెక్కించిన కాపు మంత్రాన్ని ఎంచుకున్నారు. బీసీల్లో చేర్చుతామన్న హామీని ఏ ఒక్కరూ నమ్మకపోవడంతో మేయర్‌ పీఠాన్ని కాపులకే కట్టబెడతామని కొత్త పల్లవి అందుకున్నారు.

మొన్నటి వరకూ పార్టీలో అంతర్గతంగా ఈసారి బీసీలకు ఇద్దామని చెప్పుకుని వస్తూ ఎన్నికలకొచ్చేసరికి దూరమవుతున్న కాపులను దృష్టిలో ఉంచుకుని వారికే పెద్దపీట వేస్తామంటూ తెరపైకి తెచ్చారు. ఇప్పుడీ ప్రకటనను కాపులెవ్వరూ హర్షించడం లేదు. తమ జీవితాలను నిలబెట్టేది, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే రిజర్వేషన్‌ అంశాన్ని పక్కన పెట్టి మేయర్‌ పీఠం అప్పగిస్తే మారిపోతామా అంటూ కాపులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఏ పార్టీ అయినా ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కోసారి కేటాయిస్తుందని, ఇందులో టీడీపీ గొప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement