గద్దె దక్కదన్న భయంవల్లే..
-
తెలుగు రాష్ట్రాల ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ డి.సుభాష్‌చంద్రబోస్
-
ముద్రగడ ఉద్యమానికి సంఘీభావం
-
కాపులను వెంటనే బీసీల్లో చేర్చాలని డిమాండ్
కిర్లంపూడి :
కాపులను బీసీల్లోకి చేరిస్తే ఎక్కడ రాజ్యాధికారం కోల్పోతామో అనే భయం వల్లే చంద్రబాబు ఆ అంశంపై కాలయాపన చేస్తున్నారని తెలుగురాష్ట్రాల ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ డి.సుభాష్ చంద్రబోస్ అన్నారు. మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను ఆదివారం ఆయన కలిసి కాపు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారన్నారు. కాపులను బీసీల్లోకి చేర్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లోకి చేర్చడం వల్ల ఎవరికీ నష్టం చేయకూడదనే విషయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆనాడే చెప్పారన్నారు. తక్షణమే కాపులను బీసీల్లోకి చేర్చాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లోకి చేర్చడం అంశంపై త్వరలో ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ముద్రగడ ఉద్యమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తాయన్నారు. ఆయన వెంట ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు బాలు నాయక్ తదితరులు ఉన్నారు.