విశిష్టమైనది కర్నాటక సంగీతం
విజయవాడ కల్చరల్ : భారతీయ సంగీత రారాజు కర్నాటక సంగీతమని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల గాత్ర విభాగం అధ్యాపకుడు ఎన్‌సీహెచ్ బుచ్చయ్యాచార్యులు పేర్కొన్నారు. అమ్మ సాంస్కృతిక కేంద్రం మూడురోజులపాటు కళాశాలలో నిర్వహించిన సంగీతోత్సవాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా బుచ్చయ్యాచార్యులు మాట్లాడుతూ భారతీయ సంగీతాలన్నింటిలోనూ కర్నాటక సంగీ తం విశిష్టమైనదన్నారు. సంగీతం అధ్యయనం చేసే వారికి రాగ, తాళ, జ్ఞానం అవసమని వివరిస్తూ మార్గరాగాలు, దేశీరాగాలు, ఉదయ, మధ్యాహ్న, సాయంకాల రాగాలు, సంపూర్ణ రాగాలు, జన్య రాగాలు తదితర రాగ లక్షణాలను వివరించారు. సంగీత కళాశాల పూర్వవిద్యార్థి, ఎస్‌ఆర్‌ఎస్వీ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ కార్యదర్శి గుండా గంగాధర్ మాట్లాడుతూ అమ్మ సాంస్కృతిక కేంద్రం సంగీత సేవను వివరిస్తూ, బాలబాలికల్లోని ప్రతిభను గుర్తించి వారికి అవకాశం కలిగిస్తోందని, కృష్ణమాచార్యుల ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తోం దన్నారు. కార్యక్రమంలో సంగీతాభిమానులు చిదంబరి, లలిత పాల్గొన్నారు. మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కళాకారులకు జ్ఞాపికలను అందజేశారు. వేణుగాన విద్వాంసుడు ఎస్.కుమార్‌బాబు నిర్వహించిన వేణుగానం రసవత్తరంగా సాగింది. వాగ్గేయకారులు కీర్తనలను మృదుమధురంగా వినిపించారు. ఈ కార్యక్రమాలను సంస్థ అధ్యక్షురాలు ఎన్‌సీ శాంతి, కార్యదర్శి కె.తుషార పూర్ణవల్లి నిర్వహించారు.