ఎంఎల్‌ఏ మాటిచ్చి తప్పారు...
► మండల పార్టీ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ
భోగాపురం: తనకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇస్తానని ఎంఎల్‌ఏ పతివాడ నారాయణస్వామి నాయుడు మాటిచ్చి తప్పారని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 1978లో జనతాపార్టీలో పతివాడ ఉన్నప్పటినుండి ఆయన వెనుక ఉంటూ భోగాపురం మండలంలో పార్టీని బలోపేతం చేసేవిధంగా పనిచేశానని అన్నారు. రెండేళ్ళ క్రితం ఏఎంసీ చైర్మన్ పదవి కావాలని ఎంఎల్‌ఏని కోరినప్పుడు ఆయన నేను వేరొకరికి మాటివ్వడం జరిగిందని రెండేళ్ళ తరువాత ఆ పదవిని నాకు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.
అయితే ఆయన అన్నమాట ప్రకారం ఏప్రిల్, 22, 2017న నన్ను ఏఎంసీ చైర్మన్‌గా ప్రతిపాదిస్తూ అప్పటి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కళావెంకటరావు, లోకేష్‌బాబుకి, గుంటూరు పార్టీ కార్యాలయానికి లేఖ ద్వారా తెలియజేయడం జరిగిందని అన్నారు. అయితే గతంలో ఏడున్నర సంవత్సరాలు ఏఎంసి వైస్‌చైర్మన్‌గా, ప్రస్తుతం రెండేళ్ళు చైర్మన్ పనిచేసిన వ్యక్తినే మళ్ళీ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు నేడు ఒక పత్రిక (సాక్షిలో కాదు)లో ఎంఎల్‌ఏ ప్రకటించారని వెలువడిందని ఇది అన్యాయం అని అణ్నారు. గతంలో ఎంఎల్‌ఏ పతివాడ ఎవరెవరికైతే తనను సిఫార్సు చేస్తూ లేఖరు వ్రాసారో వారందరిని కలిసి తన గోడు చెప్పుకుంటానని, తనకు న్యాయం జరిగేవరకు పోరాడతానని అన్నారు. మండలంలో పార్టీ అభివృద్దికి కష్టపడి పనిచేసిన నాకు ఈ విధంగా మాటిచ్చి మోసం చేయడం అన్యాయం అని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేదంటే ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు.