పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ దాడులు
పట్టుబడిన వారిలో ఎంపీటీసీల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కాసరనేని మురళి
రూ.7,84,990 స్వాధీనం
కేసు మాఫీకి అధికార పార్టీ నేతల ఒత్తిడి
విజయవాడ : గుట్టు చప్పుడు కాకుండా పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్న ఒక ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎంపీటీసీ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కాసరనేని మురళి పట్టుబడ్డాడు. కొంత కాలంగా నగరంలో అపార్ట్‌మెంట్లలోను, పెద్ద పెద్ద భవనాల్లోను జూదగృహాలు నడపటంైపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు విస్తృత నిఘా పెట్టారు.
ఈ క్రమంలో గురునానక్ కాలనీలోని ఒక ఇంటిలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మురళీధర్, ఎస్‌ఐ రావి సురేష్‌రెడ్డి తమ బృందంతో ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 14 మంది జూదరులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.7,84,990, 15 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ జూదగృహాన్ని జిల్లాలోని వణుకూరుకు చెందిన ఆరేపల్లి శ్రీకాంత్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయ కుడు, ఎంపీటీసీల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కాసరనేని మురళి పట్టుబడ్డాడు. అతని పేరు బయటకు రాకుండా చూసేందుకు టీడీపీ నాయకులు పోలీసులు ఒత్తిడి తెచ్చారు.
ఏం చేయాలో పాలుపోక చాలా సేపు కేసు నమోదు చేయలేదు. చేసేది లేక కేసు నమోదు చేశారు. పట్టుబడినవారిలో మచిలీపట్నం, వణుకూరు, ఉయ్యూరు ప్రాంతాలకు చెందినవారు ఎక్కువ మంది ఉన్నట్లు పేర్కొన్నారు. పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి జూదరుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదులో ఇటీవల కాలంలో ఇది పెద్ద మొత్తం కావడం విశేషం.
గ్రామాలలో జులాయిగా తిరుగుతూ స్థానికంగా ఉండే మోతుబరుల బలహీనతలను ఆసరాగా తీసుకుని కొందరు యువకులు నగరంలో ఇల్లు తీసుకుని ఇటువంటి జూదగృహాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.