టీడీపీలో పదవుల ముసలం
వలస నేతలకే పెద్దపీట
►కీలక పార్టీ పదవులు వలస నేతలతో భర్తీ
►అసంతృప్తితో రగులుతున్న తెలుగు తమ్ముళ్లు
►పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు
►ఖరారైనా ప్రకటించని కార్యవర్గాలు
నెల్లూరు: అధికార పార్టీలో పదవుల ముసలం మొదలైంది. పార్టీ కీలక పదవులన్నీ వలస నేతలతో భర్తీ చేయటానికి కసరత్తు సాగించటం వివాదాస్పదమైంది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి మినహా అన్ని పదవులకు ఇప్పటి వరకు వలస నేతలకే కట్టబెట్టేలా అమాత్యులు వ్యవహరిస్తున్నారు. దీంతో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసిన పార్టీ శ్రేణులు అమాత్యుల తీరుతో రగలిపోతున్నారు. కొందరు నేతలైతే పదవుల పందేరంపై అధిష్టానికి ఫిర్యాదులు కూడా చేసినా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో కలిసి చర్చించి జాబితాను సిద్ధం చేశారు. అయితే పదవులను తమ వెంట తిరుగుతున్న వలసనేతలు, అనుచరులకు కట్టబెట్టేందుకు రెడీ అయ్యారు.
పదవుల పందేరంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలిసింది. ఆయన అనుచరులను పదవులకు దూరంగా ఉంచారు. మంత్రి నారాయణ, బీద, ఆదాల నిర్ణయం మేరకు వలసవాదులు, అనుచరులకు పెద్దపీట వేశారని తెలిసింది. పార్టీ అధిష్టానం కూడా పదవుల జాబితాకు ఆమోద ముద్ర వేయటానికి రంగం సిద్ధం చేసింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర, ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డిని పార్టీ ప్రకటించింది. దీంతో నగర కమిటీలు, అనుబంధ విభాగాల పదవులకు సంబంధించి మే నెలలో జరిగిన మహానాడులో సంస్థాగత ఎన్నికల ప్రకియ కూడా నిర్వహించారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి అమర్‌నా«థ్‌రెడ్డి, జిల్లా మంత్రులు పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరై కమిటీల కూర్పులో కీలకపాత్ర పోషించారు. సోమిరెడ్డి కేవలం సమావేశానికే పరిమితమయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీలో పనిచేసేవారిని గుర్తించటం, సీనియార్టీ, సామాజిక ప్రాధాన్యం ఇలాంటి అంశాలను పట్టించుకోకుండా కేవలం అర్థ బలానికే ప్రాధాన్యం ఇచ్చి నేతలను ఎంపిక చేయటం వివాదాస్పదంగా మారింది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బందిపడిన వారందరినీ మంత్రులు విస్మరించటంపై శ్రేణుల్లో అసంతృప్తి రగులుతోంది. మహానాడులోనూ కొందరు కార్యకర్తలు దీనిపై నేరుగా ఇన్‌చార్జి మంత్రికే ఫిర్యాదులు చేసినా మార్పు శూన్యం.
క్యాడర్ సెగతో ఇబ్బందులే..
తాజాగా మంత్రులు సిద్ధం చేసిన జాబితాను ప్రకటించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. పదవుల పందేరం తర్వాత అసంతృప్తి పెరిగితే పార్టీ బజారున పడుతుందనేది ముఖ్య నేతల ఆందోళన. దీంతో ముందు అడుగు వేయటానికి వెనకాడుతున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే మరోవైపు మాత్రం దాదాపు ఆ ముగ్గురు ఖరారు చేసిన వారికే ప్రాధాన్యం దక్కేలా కూడా మంత్రాంగం నిర్వహించారు. ఆయా పదవులకు పోటీలో ఉన్న వారిని తప్పుకోవాలని ఇప్పటికే సూచిం చినట్లు సమాచారం. ప్రస్తుతం నగర అధ్యక్షుడిగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరగా నగర అధ్యక్ష పదవిని కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆనం జయకుమార్‌రెడ్డికి ఇవ్వాలని ఆదాల వర్గం డిమాండ్ చేస్తుండగా, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి ఇవ్వాలని మంత్రి నారాయణ వర్గం పట్టుబడుతోంది. మరోపక్క కమ్మ సామాజిక వర్గం నుంచి పమిడి రవికుమార్ చౌదరి ప్రయత్నిస్తున్నారు. దీంతో నగర అ«ధ్యక్ష పదవి పెండింగ్‌లో పడింది.
ఇక కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆనం రంగమయూర్‌రెడ్డికి జిల్లా తెలుగు యువత పదవి ఇవ్వటానికి కసరత్తు చేయగా ఈ పదవి కోసం బాలకృష్ణ చౌదరి, వంశీకృష్ణారెడ్డి పోటీపడుతున్నారు. వైఎస్సార్సీపీ నుం చి వచ్చిన జెడ్పీటీసీ సభ్యురాలు ముప్పాళ్ల విజేతకు జిల్లా తెలుగు మహిళ అధ్యక్ష పదవిని ప్రతిపాదించారు. ఈమె పేరును జెడ్పీ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. నగర మహిళ పదవిని పొడమేకల శాంతికి, నగర తెలుగు యువతను వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన తాళ్లూరి అవినాష్‌కు ఇవ్వనున్నారు. తెలుగునాడు టీచర్స్ అధ్యక్ష పదవి కాంగ్రెస్ నుంచి వచ్చిన మై«థిలి మనోహర్‌రెడ్డికి దక్కే అవకాశాలు ఉండగా, ప్రస్తుత అధ్యక్షుడు సాంబ శివరావు తననే కొనసాగించాలని కోరుతున్నట్లు సమాచారం.
ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులుగా ఆదాల అనుచరు డు సునీల్‌కుమార్‌ను మళ్లీ కొనసాగించాలని నిర్ణయిం చారు. ఈ పదవిని ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వలసవాదులు ఖాజావలికి నుడా డైరెక్టర్, చాట్ల నరసింహారావుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, నిర్మలకు మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు లభించాయి. మొత్తం మీద వలస నేతలే కీలకంగా మారి పదవులను డిమాండ్ చేస్తుండటం గమనార్హం.