ఖాజీల వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం
ఆనందపేట (గుంటూరు): ఇస్లామియా సమాజంలో ఖాజీల వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఉందని, షరియత్ ప్రకారం ముస్లింల వివాదాలు ఖాజీలు పరిష్కరించాలని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ హిదాయత్ అన్నారు. శనివారం స్థానిక బీఆర్ స్టేడియం ఎదురు గల అంజుమన్ కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాజీల సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన హిదాయత్ మాట్లాడుతూ మైనార్టీ ప్రజల కుటుంబాలకు అడపిల్ల వివాహం కోసం దుల్హన్ పథకం ద్వారా 50 వేల రూపాయలు బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఖాజీలు ఇస్లామియా షరియత్ ప్రకారం జడ్జిలతో సమానమని, పదవి ప్రతిష్టను కాపాడుకోవాలని సూచించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ మైనార్టీ ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉన్నట్లు సచార్ కమిషన్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. అమరావతిలో ఆధునాతనమైన వసతులతో కూడిన హజ్ హౌస్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశానికి ఏపీ ప్రభుత్వ ఖాజీ అసోసియేషన్ కార్యదర్శి ఖాజీ రిజ్వాన్ అధ్యక్షత వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ అజీం, మైనార్టీ నాయకులు షేక్ లాల్‌వజీర్, అమీర్ అలీ, సలీం పాషా, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.