130 మందికి ఒకే స్నానపు గది | kids facing probloms in government hostels | Sakshi
Sakshi News home page

130 మందికి ఒకే స్నానపు గది

Published Wed, Jul 13 2016 7:14 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

130 మందికి ఒకే స్నానపు గది

130 మందికి ఒకే స్నానపు గది

చాలాచోట్ల  కనీస సౌకర్యాలూ కరువే
శిథిల భవనాల్లోనే కొనసాగింపు
పెచ్చులూడుతున్న పైకప్పులు
తలుపులే లేని గదులెన్నో..
బోధన్ బీసీ హాస్టల్‌లో 130 మందికి ఒకటే స్నానపు గది
వసతి గృహాలపై పర్యవేక్షణ కరువు
ఇన్‌చార్జి వార్డెన్‌లతో ఇబ్బందులు

బోధన్ పట్టణంలోని ఓ పెంకుటింట్లో బీసీ బాలుర కళాశాల హాస్టల్ కొనసాగుతోంది. ఇక్కడ నాలుగు గదులు, తలుపులు లేని ఓ రేకుల షెడ్డూ ఉన్నాయి. ఇందులో 130 మంది విద్యార్థులు ఉంటున్నారు. నాలుగు మరుగుదొడ్లు ఉన్నా.. రెండే పనిచేస్తున్నాయి. స్నానపు గది ఒకటే ఉంది. అందరూ అదే గదిలో స్నానం చేయాలి. సంక్షేమ     హాస్టళ్ల  దుస్థితిపై కథనం..

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పాలకులు పేర్కొంటున్నా.. క్షేత్రస్థాయిలో వాటి ఫలాలు కనిపించడం లేదు. విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సంక్షేమ హాస్టళ్లలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. బోధన్‌లో ఎస్సీ బాలుర (ఎ), (బి), ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహం, బీసీ బాలుర కళాశాల, ఎస్సీ బాలుర కళాశాల, బీసీ మహిళా కళాశాల, ఎస్సీ మహిళా కళాశాల హాస్టల్స్, ఎస్టీ హాస్టల్, బెగ్గర్స్ హాస్టల్స్‌లున్నాయి. ఈ సంక్షేమ హాస్టల్స్‌లో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పలు హాస్టల్స్‌లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ఎస్టీ బాలుర హాస్టల్‌లో..
పట్టణంలోని ఎస్టీ బాలుర హాస్టల్‌లో 90 మంది విద్యార్థులున్నారు. హాస్టల్ భవనంలో పలు గదుల పైకప్పు పెచ్చులూడి పడుతోంది. బాత్‌రూం, మరుగుదొడ్డి గదులు 20 ఉండగా.. ఇందులో కొన్నింటి తలుపులు విరిగిపోయాయి.

బీసీ బాలుర కళాశాల హాస్టల్‌లో..
పట్టణంలోని రాకాసీపేట్ ప్రాంతంలో అద్దె ఇంట్లో బీసీ బాలుర కళాశాల హాస్టల్ ఉంది. పట్టణంలోని వివిధ కళాశాలలు, కోటగిరి మండలంలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదివేవారు 130 మంది ఈ హాస్టల్‌లో ఉంటున్నారు. పురాతన కాలం నాటి నాలుగు గదుల పెంకుటిళ్లు, రేకులషెడ్డులో హాస్టల్ కొనసాగుతోంది. రేకుల షెడ్డుకు తలుపు లేదు. వర్షం కురిస్తే పైకప్పులోంచి నీరు ఊరుస్తుంది. చలికి విద్యార్థులు వణకాల్సిందే.. ఈ హాస్టల్‌లో 130 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ నాలుగు మరుగుదొడ్లు ఉన్నా.. రెండే పనిచేస్తున్నాయి. ఒకే స్నానపు గది ఉండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చిరు జల్లులకే హాస్టల్ పరిసరాలు చిత్తడిగా మారుతున్నాయి. పెంకుటిళ్లు కావడంతో పైకప్పులు ఊరుస్తున్నాయి. రేకుల షెడ్డుకు తలుపులు లేకపోవడంతో చలికి వణుకుతున్నారు. ఏ సమయంలో ఏ పురుగు వస్తుందోనని భయపడుతున్నారు. హాస్టల్ వార్డెన్ చక్రధర్‌కు కళాశాల హాస్టల్‌తో పాటు బీసీ బాలుర హాస్టల్, చందూరు బీసీ బాలుర హాస్టల్ నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు. మూడు హాస్టళ్లకు ఒకే వార్డెన్ ఉండడంతో పర్యవేక్షణ లోపించింది.

శిథిలావస్థలో బీసీ బాలుర హాస్టల్..
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో ఉన్న బీసీ బాలుర హాస్టల్ భవనంలో 100 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ హాస్టల్ భవనం దశాబ్దాల క్రితం నిర్మితమైంది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. పైకప్పు పెచ్చులూడిపోతోంది. వర్షం కురిస్తే నీరు గదుల్లోకి చేరుతోంది. హాస్టల్‌లో 9 గదులుండగా.. ఇందులో మూడింటిని ఆఫీసు, కిచెన్, స్టోర్ రూంలకు కేటాయించారు. మిగిలిన ఆరు ఇరుకు గదుల్లో విద్యార్థులు ఉంటున్నారు. పై కప్పు పెచ్చులూడుతుండడంతో విద్యార్థులు భయాందోళనలకు గురి అవుతున్నారు.

ఎస్సీ బాలుర (ఎ) హాస్టల్‌లో..
రాకాసీసేట్ ప్రాంతంలో ఉన్న ఎస్సీ బాలుర (ఎ) 100 మంది విద్యార్థులున్నారు. పాఠశాల భవనంలో హాస్టల్ ఉంది. నాలుగు గదులు మాత్రమే ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

అధికారుల దృష్టికి  తీసుకెళ్లాను
బీసీ బాలుర కళాశాల అద్దె రేకుల షెడ్డు లో కొనసాగుతోంది. ఇక్కడ సౌకర్యవంతంగా లేదు. హాస్టల్ భవనం దుస్థితిని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. బీసీ సంక్షేమ శాఖలో నిధుల లేమి ఉందని అధికారులు అంటున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. - చక్రధర్, వార్డెన్, బీసీ బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్, బోధన్

దుప్పట్లు, పెట్టెలు ఇవ్వలేదు
హాస్టల్‌లో సరైన వసతులు లేవు. మ్యాట్‌లు మాత్రమే ఇచ్చా రు. దుప్పట్లు ఇంకా ఇవ్వలేదు. పాత పెట్టెలే వాడుకుంటున్నాం. హాస్టల్‌లో నాలుగు గదులున్నాయి. ఒక్కోదాంట్లో 25 మంది విద్యార్థులం ఉంటున్నాం. దీంతో ఇబ్బందిగా ఉంది.
- శ్రీకాంత్, ఎస్సీ బాలుర(ఎ) హాస్టల్ విద్యార్థి, బోధన్

ఇరుకు గదులతోనే ఇబ్బంది
పాఠశాలలు పునఃప్రారంభమై నెల దాటింది. ఇప్పటి వరకు మాకు యూనిఫాంలు ఇవ్వలేదు. హాస్టల్‌లో వంద మంది ఉన్నారు. భోజనం బాగానే ఉంది. కానీ ఇరుకు గదులతోనే ఇబ్బం దులు పడుతున్నాం. హాస్టల్‌కు సొంత భవనం నిర్మిస్తే సమస్య తీరుతుంది.
- శ్రీనివాస్, ఎస్సీ బాలుర (ఎ) హాస్టల్ విద్యార్థి, బోధన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement