పరిటాల నేతృత్వంలో.. ప్రజాస్వామ్యం ఖూనీ | Kill democracy | Sakshi
Sakshi News home page

పరిటాల నేతృత్వంలో.. ప్రజాస్వామ్యం ఖూనీ

Published Thu, Dec 15 2016 12:28 AM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

పరిటాల నేతృత్వంలో.. ప్రజాస్వామ్యం ఖూనీ - Sakshi

పరిటాల నేతృత్వంలో.. ప్రజాస్వామ్యం ఖూనీ

  • కనగానపల్లి ఎంపీపీ ఎన్నికలో దౌర్జన్యకాండ
  • మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులపై దాడి
  • టీడీపీ అభ్యర్థికి ఓటేయకపోతే చంపుతామంటూ బెదిరింపులు
  • టీడీపీ అభ్యర్థి ఎంపీపీగా ఎన్నికైనట్లు ఏకపక్ష ప్రకటన
  • మీడియాను దూరం పెట్టి  అధికార ‘అరాచకానికి’ సహకరించిన ఎన్నికల అధికారులు, పోలీసులు
  • ‘పరిటాల రౌడీయిజం’పై వైఎస్సార్‌సీపీ, సీపీఐతో పాటు బీసీ సంఘాల మండిపాటు
  • బీసీ వ్యక్తికి ఎంపీపీ పదవి దక్కకుండా దౌర్జన్యం చేశారంటూ ఆగ్రహం
  • న్యాయ పోరాటం చేస్తామని స్పష్టీకరణ

  • అనంతపురం :
    పార్టీ అధికారంలో ఉంది. చేతిలో ‘అమాత్య’ పదవి ఉంది. పోలీసులు, అధికారులు కూడా అండగా ఉన్నారు. దౌర్జన్యం చేసినా, రౌడీయిజం చెలాయించినా అడిగేవారు లేరు. ఇంకేముంది.. మంత్రి పరిటాల సునీత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ఎన్నిక ప్రక్రియను అపహాస్యం చేస్తూ  అరాచక రాజకీయానికి తెరలేపారు.

    కనగానపల్లి మండల పరిషత్‌ అధ్యక్ష పదవి అడ్డదారుల్లో టీడీపీకి దక్కేలా చూశారు. గతంలో కనగానపల్లి ఎంపీపీగా ఎన్నికైన బిల్లే రాజేంద్రతో అధికార పార్టీ నాయకులు పది రోజుల క్రితం బలవంతంగా రాజీనామా చేయించారు. బీసీ వర్గానికి చెందిన రాజేం‍ద్ర స్థానంలో ‘తమ సామాజిక వర్గం’ వారిని కూర్చోబెట్టాలన్నది వారి ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే రాజేంద్రను పదవి నుంచి తప్పించారు. దీన్ని నిరసిస్తూ రాజేంద్రతో పాటు వైస్‌ ఎంపీపీ పున్నం వెంకటరామిరెడ్డి, కనగానపల్లి ఎంపీటీసీ సభ్యురాలు బిల్లే గంగమ్మ ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇదిలావుండగా, బుధవారం కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నూతన ఎంపీపీ ఎన్నికను అధికారులు నిర్వహించారు.  వైఎస్సార్‌సీపీ తరఫున బిల్లే రాజేంద్ర, టీడీపీ నుంచి ముత్తువకుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు పద్మగీత నామినేషన్‌ వేశారు. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో వైఎస్సార్‌సీపీకి ఏడుగురు, టీడీపీకి నలుగురు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.  మెజారిటీ సభ్యులున్న వైఎస్సార్‌సీపీకే ఎంపీపీ పదవి దక్కాలి. అయితే.. అలా జరగకూడదన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరిన  ఇద్దరు ఎంపీటీసీల (రాజేంద్ర, వెంకటరామిరెడ్డి)తో టీడీపీ నాయకులు బలవంతంగా ఓట్లు వేయించారు.  6–5 తేడాతో ఎంపీపీ పదవి టీడీపీకి దక్కినట్లు ప్రకటింపజేసుకున్నారు.


    ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన మంత్రి
    అధికార టీడీపీకే ఎంపీపీ పదవి దక్కాలన్న ఉద్దేశంతో మంత్రి పరిటాల సునీత ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. ఆమెను అధికారులు ఎన్నికల నిర్వహణ కేంద్రంలోకి అనుమతించారు.  ఎన్నిక పూర్తయ్యే వరకు మంత్రి అక్కడే కూర్చొన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిన ఎంపీటీసీలు బిల్లే రాజేంద్ర, పున్నం వెంకటరామిరెడ్డి దగ్గరకు వెళ్లిన ఆమె వారిని తీవ్రంగా బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళా ఎంపీటీసీలను కూడా ఇటువైపు రావాలంటూ టీడీపీ సభ్యుల చేత లాగించినట్లు  చెబుతున్నారు. ఈ సందర్భంలో వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు ఎంపీటీసీలు ఎదురుతిరిగినా వారిని పోలీసులు, టీడీపీ ఎంపీటీసీలతో కొట్టించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఎన్నికల అధికారులు కూడా కొంత సహకారం అందించటంతో దౌర్జన్యంగా ఆరుగురు ఎంపీటీసీ సభ్యులతో టీడీపీ అభ్యర్థి పద్మగీతకు ఓట్లు వేయించుకొని (చేతులెత్తడం) ఎంపీపీ పదవిని తమ పార్టీకి దక్కేలా చేసుకున్నారు.


    మీడియాను దూరం పెట్టి.. అధికార పార్టీకి కొమ్ముకాసిన అధికారులు
     చేతులు ఎత్తే విధానంలో ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు అధికారులు  మీడియాను దూరం పెట్టి అధికార పార్టీకి పరోక్షంగా సహకరించారు.  కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనే పోలీసులు మీడియా ప్రతినిధులను ఆపారు. తద్వారా ఎన్నికల  కేంద్రంలో జరుగుతున్న సంఘటనలు బయటకు రాకుండా చూశారు. ఎన్నిక ప్రక్రియను వీడియో తీయించామని అధికారులు చెబుతున్నారు. కానీ ఎన్నిక సమయంలో జరిగిన సంఘటనలపై పుటేజీని వారు  బయటకు విడుదల చేయలేదు. ఎంపీపీ ఎన్నిక పూర్తయిన తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు హంగామా చేయడంలో అప్పుడు మాత్రమే మీడియాను  అనుమతించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు గంగుల సుధీర్‌రెడ్డి, రామాంజినేయులు తదితరులు బయటకువచ్చి లోపల జరిగిన దౌర్జన్యకాండను మీడియాకు వివరించారు. మీడియా ప్రతినిధులు ఎన్నికల నిర్వహణ కేంద్రంలోకి వెళ్లి చూడగా అక్కడ విరిగిపోయిన కుర్చీలు, సభ్యులు విసురుకొన్న నీళ్ల బాటిళ్లు కనిపించాయి. దీనిపై ఎన్నికల అధికారి, ధర్మవరం ఆర్డీఓ బాలానాయక్‌ను వివరణ కోరగా.. ఎంపీపీ ఎన్నిక పూర్తయిన తర్వాత కొంతమంది సభ్యులు తోసుకున్నారని, దీంతో నాసిరకంగా ఉండే కుర్చీలు విరిగిపోయాయని చెప్పారు. కానీ ప్రతిపక్ష పార్టీ ఎంపీటీసీ సభ్యులు చెబుతున్న ప్రకారం ఎంపీపీ ఎన్నిక సమయంలో మంత్రి సూచన మేరకు అధికార పార్టీ ఎంపీటీసీలతో పాటు పోలీస్‌ సిబ్బంది కూడా వారిపై దాడి చేసినట్లు అర్థమవుతోంది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement