మూడేళ్లూ...కన్నీళ్లే!
- ‘అనంత’ అభివృద్ధికి 21 వరాలు ప్రకటించిన చంద్రబాబు
- ఇంతవరకూ ఏ ఒక్కటీ నెరవేర్చని వైనం
- 15 సార్లు జిల్లాలో పర్యటించిన సీఎం
- ఊకదంపుడు ప్రసంగాలు...ఊరించే మాటలు
– హామీల అమలులో కనిపించని చిత్తశుద్ధి
అనంతపురం : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా మూడేళ్లు. తనపై ఆదరాభిమానం చూపుతున్న ‘అనంత’ను వ్యవసాయం, సంక్షేమం, విద్య, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పలు వరాలు ప్రకటించారు. అవికాక ‘అనంత’ పర్యటనకు వచ్చినపుడు మరికొన్ని హామీలు ఇచ్చారు. ఈ మూడేళ్ల పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయారు. ఇప్పటిదాకా 15 సార్లు ‘అనంత’ పర్యటనకు విచ్చేసిన ‘బాబు’ మాటలైతే కోటలు దాటేలా చెప్పారు కానీ..ఆచరణలో ఘోరంగా విఫలమయ్యారు. జిల్లా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ‘అనంత’ ప్రజలు నిత్యం కరువు కోరల్లో చిక్కుని తీవ్రంగా నష్టపోతుంటారు.
అందువల్లే రైతుల ఆత్మహత్యల జాబితా పెరిగిపోతోంది. ఉపాధి లేక రైతులు, రైతు కూలీల ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇలాంటి జిల్లా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు పారిశ్రామిక, విద్యా రంగాలు అభివృద్ధి చెందాలి. ఈ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. విద్య, సాగునీటి రంగాలపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు. జేఎన్‌టీయూను స్థాపించి విద్యారంగ అభివృద్ధికి దోహదం చేశారు. హంద్రీ–నీవా ప్రాజెక్టును చేపట్టి వ్యవసాయరంగానికి దన్నుగా నిలిచారు. హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను కూడా వైఎస్ హయాంలో చేపట్టారు. ఇవి పూర్తయి కేటాయింపుల మేరకు నీటిని జిల్లాకు రప్పించగలిగితే జిల్లా సాగు నీటి కష్టాలు దాదాపుగా తీరినట్లే! 2014 జూన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాగునీటి రంగానికి చేయాల్సింది దాదాపుగా ఏమీ లేదు. 85 శాతం మేర పూర్తయిన హంద్రీ–నీవా పనులను పూర్తి చేయడం మినహా. దీంతో పారిశ్రామిక, విద్యారంగంపై దృష్టి సారిస్తారని ‘అనంత’ వాసులు ఆశపడ్డారు. రాజధాని ప్రకటన సమయంలో అసెంబ్లీలో జిల్లా అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలతో ఆనందించారు.
సన్నగిల్లిన నమ్మకం
జిల్లా అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రకటించిన 21 వరాల్లో సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ అనుబంధ కేంద్రం, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్, టెక్స్‌టైల్ పార్క్ కీలకమైనవి. వీటితో పాటు జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మార్చడం, పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం ఏర్పాటు, సోలార్, విండ్ పవర్ అభివృద్ధి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్టు నిర్మించి పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇవ్వడం ఉన్నాయి. వీటితో పాటు హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేస్తామని కూడా ప్రకటించారు. ఇంత భారీ ప్రాజెక్టు ద్వారా కేవలం జిల్లాలోని చెరువులకు నీళ్లు ఇచ్చి ఆయకట్టుకు మొండిచేయి చూపే యోచనలో చంద్రబాబు ఉన్నారు. డ్వాక్రా, రైతు రుణమాఫీ హామీ అంతంతమాత్రంగానే అమలు చేయడంతో తక్కిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తారనే అనుమానాలు జిల్లా వాసుల్లో ఉన్నాయి. హామీల అమలుకు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవడంలో జిల్లా మంత్రులు, ఎంపీలు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిగా విఫలమయ్యారు.
జిల్లాకు సంబంధించి సీఎం ప్రకటించిన వరాలు...వాటి అమలు తీరు పరిశీలిస్తే...
ఇచ్చిన హామీలు.. ప్రస్తుతం ఉన్నతీరు
1. హిందూపురంలో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి.. ఇప్పటి వరకూ అతీగతీ లేదు
2. 5 ఎకరాల వరకూ వందశాతం సబ్సిడీతో డ్రిప్, 10ఎకరాల వరకూ 90శాతం సబ్సిడీతో డ్రిప్.. వైఎస్ హయాం నుంచి ఈ 90శాతం సబ్సిడీ ‘అనంత’లో అమలవుతోంది.
3. ఏడాదిలోపు హంద్రీ–నీవా పూర్తి.. మూడేళ్లయినా పూర్తి కాలేదు.
4. మార్కెట్ సదుపాయాలు కల్పించి, జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తా.. చర్యలు లేవు.
5. పింఛన్ల అర్హతను 5ఎకరాలుగా ఉంది. ‘అనంత’లో మాత్రం 10ఎకరాల వరకూ సడలింపు .. ఆ మేరకు జీఓ జారీ చేశారు.
6. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ.. పాక్షికంగా కూడా చెల్లించలేదు.
7. సబ్బుల ఫ్యాక్టరీని నిర్మిస్తాం.. పురోగతి లేదు.
8. హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తి చేస్తాం.. తీసుకున్న చర్యలు నామమాత్రమే.
9. ఉద్యానవన కేంద్రం.. లేదు.
10. సెంట్రల్ యూనివర్శిటీ.. లేదు.
11. ఎయిమ్స్ అనుబంధ కేంద్రం.. ఊసేలేదు.
12. నూతన పారిశ్రామిక నగరం.. పురోగతి లేదు.
13. ‘అనంత’ను స్మార్ట్‌సిటీగా చేస్తాం.. వర్షం నీరు వెళ్లేందుకు కూడా సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు.
14. టెక్స్‌టైల్ పార్క్.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
15. ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్.. ప్చ్...అదీ లేదు
16. సోలార్, విండ్ పవర్ హబ్.. ఎన్‌పీ కుంట వద్ద సోలార్‌ప్లాంటు ఏర్పాటు చేశారు.
17. పెనుకొండలో ఇస్కాన్ ప్రాజెక్టు..పురోగతి లేదు.
18. బీఈఎల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) కేంద్ర ప్రభుత్వ సంస్థ.. కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ శంకుస్థాపన చేశారు.
19. ఆధ్మాతిక నగరంగా పుట్టపర్తి.. ఎలాంటి పురోగతి లేదు.
20. పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం.. ఏదీ లేదు.
21. కుద్రేముఖ్ ఇనుపఖనిజ ఆధారాతి ప్రాజెక్టు.. గతంలో ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది.