కండువాలు కప్పడమే టీఆర్‌ఎస్ అజెండా: కిషన్‌రెడ్డి | kishan reddy fires on trs party | Sakshi
Sakshi News home page

కండువాలు కప్పడమే టీఆర్‌ఎస్ అజెండా: కిషన్‌రెడ్డి

Published Wed, Mar 2 2016 4:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

kishan reddy fires on trs party

వరంగల్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి ఇతర పార్టీల నాయకులకు గులాబీ కండువాలు కప్పడమే అజెండాగా పెట్టుకుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పరిపాలన కంటే కండువాలను కప్పడమనే అజెండాతోనే టీఆర్‌ఎస్ పనిచేస్తోందన్నారు. తెలంగాణ వద్దన్నవారు, నోటి నుంచి జై తెలంగాణ అనని వారు ఇప్పుడు తెలంగాణ ప్రజలపై పెత్తనం చేస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కిషన్‌రెడ్డి మంగళవారం హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ఎంత అవసరమో... ప్రతి పక్షం అంతే అవసరమని భావించి బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రెండు పక్షాలకు అధికారం కల్పించారని చెప్పారు.

ప్రతి పక్షం లేకుండా చేసి ఇష్టానుసారంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్ వారు చూస్తున్నారని అన్నారు. వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసే విషయంలో బీజేపీ అంకితభావంతో ఉందని చెప్పారు. కేంద్ర బడ్టెట్‌పై టీఆర్‌ఎస్ నేతల మధ్య ఏకాభిప్రాయం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ కూతురు ఎంపీ కవిత కేంద్ర బడ్జెట్ బాగుందని ఢిల్లీలో చెప్పారని, రాష్ట్రంలో మంత్రి హరీష్‌రావు, ఇతర టీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పరాభవం తప్పదని, బీజేపీ సత్తాను చాటుతుందని కిషన్‌రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement