
తెలంగాణ అభివృద్ధిపై వెనక్కి తగ్గను : కోదండరాం
ఆదిలాబాద్: తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం మంగళవారం స్పందించారు. ఆయన ఏంమన్నారంటే 'ఇప్పటికే ముప్పావు జీవితం గడిచిపోయింది. పావలా జీవితమే మిగిలి ఉంది. దాన్నీ తెలంగాణకే అంకితం చేస్తాను. ఎవరో ప్రేరేపిస్తే....ప్రేరేపించబడే వాడిని నేను కాను. తెలంగాణ ప్రాంత అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదు' అని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో రెండేళ్ల తెలంగాణ-ప్రజల ఆకాంక్షలు-ప్రభుత్వ పనితీరుపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న కోదండరాం విలేకరులకు అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానమిచ్చారు. రేపు జరగబోయే జేఏసీ సమావేశంలో చర్చించుకుని ప్రభుత్వం తనపై చేస్తున్న విమర్శలకు సమాధానం చెబుతానన్నారు. 30 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి, ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కూడా ప్రజల సమస్యలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ సాధించామో ఆ లక్ష్యం నెరవేరే దాక ప్రజల పక్షాన పోరాడుతామని కోదండరాం చెప్పారు.