పానీపాట్లే..!
► పల్లెల్లో తప్పని తాగునీటి తిప్పలు
► అడుగంటిన భూగర్భజలాలు
► వట్టిపోయిన బోర్లు..
► అక్కడక్కడా ట్యాంకర్లతో సరఫరా
► అయినా తీరని నీటి కష్టాలు
బిందెడు నీటికోసం బండెడు కష్టాలు పడుతున్నారు పల్లెజనం. ఏ గ్రామంలో చూసినా నీటి కష్టాలే. తాగడానికి చుక్కనీరు లేక గొంతెండుతుంటే నీళ్ల ట్యాంకర్ ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ట్యాంకర్ ద్వారా వచ్చే నీళ్లు కూడా సరిపోక కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచి తెచ్చుకొని బతుకీడుస్తున్నారు. ఇదీ షాద్‌నగర్ నియోజక వర్గంలోని కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లోని దుస్థితి.
కొందుర్గు: రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత వల్ల భూగర్బజలాలు అడుగంటాయి. బోరుబావుల్లో నీటిమట్టం తగ్గిపోవడంతో కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లోని అన్ని గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారు. చుక్కనీటి కోసం బోర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొందుర్గు, చౌదరిగూడ, ముట్పూర్, గుంజల్‌పహాడ్, రావిర్యాల, టేకులపల్లి, ఆగిర్యాల తదితర గ్రామాలతోపాటు, గాలిగూడ, జాకారం, ఎదిర, చిన్నఎల్కిచర్ల గ్రామాలకు సంబంధించిన గిరిజన తండాల్లో తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. రెండు మండలాల్లో కలిసి 250 చేతిపంపులుండగా 150 చేతిపంపులు పనిచేస్తున్నాయని, 800 సింగిల్‌ఫేస్ బోర్లకు 226 సింగిల్‌ఫేస్ బోర్లు, 63 త్రీ ఫేస్ బోర్లకు 20 మాత్రమే పనిచేస్తున్నాయి. బోరు బావుల్లో సరిపడా నీళ్లు రాకపోవడంతో గ్రామాల్లో మహిళలు కుళాయిల వద్ద బిందెలతో క్యూకడుతున్నారు. బిందెడు నీటికోసం రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. కొందుర్గు మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ కాలనీవాసులు నీటికోసం ఖాళీబిందెలు పట్టుకొని ఏకంగా మండలపరిషత్ కార్యాలయాన్నే ముట్టడించారు. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా నీటికోసం ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.
నీటికొరత ఉన్న గ్రామాలను గుర్తిస్తున్నాం: నీటికోసం ఇబ్బంది పడే గ్రామాలను గుర్తిస్తున్నాం. అవకాశం ఉన్న గ్రామాల్లో వ్యవసాయబోర్లను లీజుకు తీసుకుంటున్నాం. లేకుంటే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. కొందుర్గు మండలంలోని ఆగిర్యాల, పాత ఆగిర్యాలతోపాటు జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని ఏడు గ్రామాల్లో బోర్లు లీజుకు తీసుకున్నాం. –జయశ్రీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, కొందుర్గు
బోరులో పూర్తిగా నీళ్లు తగ్గిపోయాయి. చుక్కచుక్క నీళ్లు వస్తున్నాయి. ఒక బిందె నిండాలంటే అరగంట సమయం పడుతుంది. నీటికోసం గంటలకొద్ది నిలబడాల్సి వస్తుంది. రాత్రింబవళ్లు నీటికోసం తిప్పలుపడుతున్నాం. నీటి సమస్య తీర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. –పద్మమ్మ, రావిర్యాల