గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నల్గొండ : గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా ఎక్స్ప్రెస్ను నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం రైల్వే అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు హైదరాబాద్‌ను వణికించిన వర్షాలు ఇప్పుడు గుంటూరు జిల్లాపై పడ్డాయి.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నరసరావుపేట శివార్లలో రెండు బస్సులు వాగులో చిక్కుకుపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమను రక్షించాలంటూ బస్సులోంచి కేకలు పెట్టారు. దాంతో స్థానికులు జాగ్రత్తగా ప్రయాణికులందరినీ ఒడ్డుకు చేర్చారు. అయితే వారి సామాన్లు అన్నీ బస్సులోనే ఉండిపోయాయి.
బస్సు కూడా వాగునీటిలో ఒరిగిపోయింది. మరోవైపు రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రైల్వే ట్రాక్ మీదకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పలు రైళ్లను రైల్వే అధికారులు ఎక్కడికక్కడే నిలిపి వేశారు. మాచర్ల ప్యాసింజర్ పిడుగురాళ్లలోను, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రెడ్డిగూడెంలోను, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ బెల్లంకొండలోను ఆగిపోయాయి.