విమాన ప్రయాణ చార్జీలకు రెక్కలు
పుష్కరాల ప్రభావంతో పెరిగిన వైనం
విమానాశ్రయం(గన్నవరం): కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే యాత్రికుల కోసం ఆర్టీసీ ఉచిత, అదనపు బస్సులు, రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతుంటే.... విమానయాన సంస్థలు మాత్రం ప్రయాణికుల అవసరాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. పుష్కరాలకు ఎయిర్‌కోస్టా హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీస్ మినహా మిగిలిన విమాన సంస్థలేవీ అదనపు సర్వీసులు నడిపేందుకు ముందుకురాలేదు. దీంతో ప్రస్తుతం విమాన సర్వీసులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
సాధారణ రోజుల్లో రూ.1,500 నుంచి రూ.4,500 వరకు ఉండే విమాన టికెట్ వెల పుష్కరాల ప్రారంభంతో మూడు నుంచి ఆరు రెట్లు పెరిగాయి. విజయవాడ నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు విమాన సర్వీసుల చార్జీలు ఆకాశన్నంటుతున్నాయి. పుష్కరాల ముందు వరకు రూ.5 వేలు వరకు పలికిన ఎయిరిండియా విజయవాడ-న్యూఢిల్లీ సర్వీసుల చార్జీ ఆదివారం రూ. 14,111కు చేరుకుంది.
ఇదే సర్వీసుకు 15న ఢిల్లీ-విజయవాడకు రూ.16,076గా ఉంది. రూ.3 వేలలోపు టికెట్ ఉండే స్పైస్‌జెట్ విజయవాడ-బెంగళూరు సర్వీసుకు రూ.12,400, విజయవాడ-చెన్నైకు రూ.10,400, విజయవాడ-హైదరాబాద్‌కు రూ.9,199, బెంగళూరు- విజయవాడకు రూ.8,499 వరకు పెరిగింది. ఎయిర్ కోస్టా విజయవాడ-బెంగళూరు సర్వీసులో రూ.5వేల లోపు చార్జీ ఉండే టికెట్ ప్రస్తుతం రూ.10,120 పలుకుతోంది. ఒక్కసారిగా విమాన చార్జీలకు రెక్కలు రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు.