చలో.. చలో!
నల్లగొండ టు ఊటి, కేరళలోని మున్నార్, ముంబయి, హైదరాబాద్ .. ఏమిటీ ఏదో టూర్ గైడెన్స్ అనుకుంటు న్నారా.. కాదండోయ్.. మన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తరలివెళ్లిన క్యాంపు ప్రాంతాలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు చేయి జారకుండా ఉండేందుకు పార్టీలు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు వారిని వేర్వేరు గుంపులుగా తయారు చేసి ఒక్కో ప్రాంతానికి తరలిస్తున్నాయి. కొందరు గురువారం రాత్రి వెళ్లగా మరికొందరు శుక్రవారం క్యాంపులకు తరలివెళ్లారు.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : చిన్నపామునైనా .. పెద్ద కర్రతో కొట్టాలన్న తరహాలో అధికార టీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరిస్తోంది. నల్ల గొండ స్థానిక సంస్థల మండలి స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆ పార్టీ నాయకత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. మెజారిటీ సభ్యులు తమ పార్టీలోనే ఉన్నా.. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను, మున్సిపల్ కౌన్సిలర్లను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తోంది. ఈనెల 31వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. అప్పటివరకు వారందరినీ రాష్ట్రం వెలుపల వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలిస్తోంది. శుక్రవారంనుంచి ఆ పని మొదలు పెట్టింది.
ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. 2015 డిసెంబర్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. క్యాంపులు నిర్వహించినా క్రాస్ ఓటింగ్ వల్ల కాంగ్రెస్ 193 ఓట్ల మెజారిటీతో గెలిచింది. కానీ, అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితుల మధ్య చాలా తేడా ఉంది. కాంగ్రెస్‌నుంచి గెలిచిన పలువురు ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారు. అయినా.. ఈసారి గెలిచి తీరాలన్న వ్యూహంతో గులాబీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో తలపడిన తేరా చిన్నపరెడ్డి ఈ సారి కూడా టీఆర్ఎస్నుంచి రంగంలో ఉన్నారు.
చిన్నపరెడ్డిపై గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలవడంతో అనివార్యమైన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మికి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. వాస్తవానికి ఏ పార్టీ చేతిలో ఎన్ని ఓట్లు ఉన్నాయన్న గణాంకాలు పరిశీలిస్తే.. టీఆర్ఎస్ శిబిరంలోనే ఎక్కువ మంది ఉన్నారు. అయినా.. ఆ పార్టీ ఓట్లను కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను గురువారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారని సమాచారం. హైదరాబాద్ నుంచి వీరిని శుక్రవారం ప్రైవేటు బస్సుల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలించినట్లు తెలిసింది.
బయటి నేతలకు క్యాంపుల నిర్వహణ బాధ్యతలు
ఈసారి జిల్లా నాయకులతోపాటు మంత్రులు, పార్టీ సీనియర్లకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పజెప్పారు. దేవరకొండకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గానికి ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి, మునుగోడుకు మంత్రి నిరంజన్‌రెడ్డి, నకిరేకల్ నియోజకవర్గానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. ఇలా... ఒక్కో నియోజకవర్గానికి చెందిన స్థానిక ఎమ్మెల్సీ ఓటర్ల క్యాంపులకు బాధ్యతలు అప్పజెప్పారని పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికలకు పద్నాలుగు రోజులు ముందుగానే తమ పార్టీకి చెందిన వారితోపాటు మరికొందరు ఇతరులను కలిపి సుమారు ఏడు వందల మందిని క్యాంపులకు తరలించినట్లు చెబుతున్నారు. అందరినీ ఒకే చోట కాకుండా సభ్యులనూ విడగొట్టి క్యాంపులకు కేటాయించారంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను దక్షిణాది రాష్ట్రాలకు, మున్సిపల్ కౌన్సిలర్లను ఉత్తరాది రాష్ట్రాలకు పంపిస్తున్నారని తెలిసింది.
గురువారం కొందరు..శుక్రవారం మరికొందరు
మిర్యాలగూడ, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన ప్రతినిధులను గురువారం రాత్రి, నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన ఓటర్లను శుక్రవారం క్యాంపులు ఏర్పాటు చేసిన ప్రాంతాలకు తరలించినట్లు తెలిసింది. తమిళనాడులోని ఊటి, కేరళలోని మున్నార్ ప్రాంతాల్లో, ముంబయిలో క్యాంపులు పెట్టినట్లు సమాచారం. స్థానిక ఓటర్లు పాత వారే కావడంతో చివరాఖరులో అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే.. ఈ సారి ఓట్లకు రేటు నిర్ణయమైనట్లు ప్రచారం జరుగుతోంది.