ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు
♦ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడి
♦ ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబరు
♦ 1800 425 6656 ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పవిత్ర కృష్ణా పుష్కరాలు ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ ప్రారంభమై 23వ తేదీతో ముగుస్తాయని దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వెల్లడించారు. పుష్కరాల నేపధ్యంలో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 173 పుష్కర ఘాట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి వివరించారు. దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ అనురాధలతో కలసి మంత్రి శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పుష్కరాల నిర్వహణ, పర్యవేక్షణకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర స్థాయిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రుల కమిటీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తారని తెలిపారు. అనంతరం ఆలయాల్లో భక్తులకు ఎదురయ్యే అసౌకర్యాలపై శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరు 1800 425 6656ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
ఇంటి వద్దకే దేవుడి పూజలు
తిరుమలలో ఇటీవల జరిగిన హిందూ సాధు సంతుల సమ్మేళనంలో వ్యక్తమైన సూచనల మేరకు పలురకాల సేవలను భక్తుల ఇంటి వద్దకే తీసుకెళ్లాలని దేవాదాయ శాఖ నిర్ణయించినట్టు మాణిక్యాలరావు తెలిపారు. ఈ ఏడాది ఉగాది పండుగ నుంచి ఏడు సందర్భాల్లో గుడి పూజారి.. భక్తుని ఇంటి వద్దకే వచ్చి దేవుడి ఆశీస్సులు అందజేస్తార న్నారు. కొత్త దంపతులకు, గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమం చేసేటప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, నామకరణం, అన్న ప్రాసన, అక్షరాభ్యాసం వంటి సమయాల్లో గుడి పూజారి దేవుడి పటంతో భక్తుల ఇంటికే వెళ్లి దీవెనలు, అమ్మవారి కుంకుమ అందజేస్తారని తెలిపారు.
అలాగే మరణించిన వ్యక్తి ఇంటికి శివుడికి అభిషేకించిన జలాలతో వెళ్లి ఆ ఇంటిని శుద్ధి చేసే కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు.ఆసక్తి ఉన్న వారికి మాత్రమే ఇలాంటి సేవలు అందజేస్తామని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు.