పోతిరెడ్డిపాడు నూతన గేట్లనుంచి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణమ్మ పరుగులు
Published Tue, Sep 19 2017 11:11 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
- పోతిరెడ్డిపాడు, ఎన్‌సీఎల్ గేట్లు ఎత్తిన సీఈ, ఎస్‌ఈ
- ఎన్‌సీఎల్ విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 1500 క్యూసెక్కులు
జూపాడుబంగ్లా: శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం నిర్దేశించిన స్థాయి(859 అడుగులు)కి చేరుకోవడంతో మంగళవారం పోతిరెడ్డిపాడు ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. మంగళవారం సీఈ, ఎస్‌ఈ, ఈఈలు నారాయణరెడ్డి, రాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి మంగళవారం పోతిరెడ్డిపాడు నూతన హెడ్‌రెగ్యులేటర్, నాగార్జున విద్యుదుత్పత్తికేంద్రం గేట్లను ఎత్తడంతో కృష్ణాజలాలు దిగువకు పరుగులు తీశాయి. ముందుగా పోతిరెడ్డిపాడు మూడు గేట్లను మూడు అంగుళాల మేరకు ఎత్తి నీటిని విడుదల చేశారు. అనంతరం మరో నాలుగు గేట్లను ట్రయల్‌రన్ నిర్వహించి చెక్‌చేశారు. అనంతరం పక్కన్నే ఉన్న నాగార్జున విద్యుదుత్పత్తి కేంద్రంలో ఈఈ శ్రీనివాసరెడ్డి పూజలు చేసి మూడు జనరేటర్లను ఆన్ చేశారు. కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం 1,500క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అనంతరం సీఈ నారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో 859 అడుగుల నీటిమట్టం వద్ద 103 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి 5టీఎంసీల నీటి విడుదలకోసం కృష్ణాబోర్డుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పిన సీఈ.. ఇంకా అనుమతి లభించలేదన్నారు. అయితే రాయలసీమ ప్రాంతంలో తలెత్తిన తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. అడపా దడపా కురుస్తున్న వర్షాల వల్ల ఎస్సార్బీసీ, తెలుగుగంగ కాల్వల్లో కొద్ది మేర నీరున్న నేపథ్యంలో పోతిరెడ్డిపాడు నుంచి విడుదలచేసే నీటితో వెలుగోడు రిజర్వాయర్ నింపనున్నట్లు తెలిపారు. గత ఏడాది మొత్తంగా పోతిరెడ్డిపాడు ద్వారా 67 టీఎంసీల నీటిని డ్రా చేసుకున్నామని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో డ్రా చేసుకునే వీలుందని సీఈ తెలిపారు.
కాల్వలకు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నీటిని విడుదల చేస్తారనే విషయంపై నీటిలభ్యతను బట్టి ఐఏబీ సమావేశంలో నిర్ణయిస్తారన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఈఈ పురుషోత్తంరెడ్డి, ట్రైనీ ఈఈ విశ్వనాథ్, డీఈ వెంకటరమేష్‌బాపూజీ, ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి, ట్రైనీ ఇంజినీర్లు, ఎన్‌సీఎల్ మేనేజర్ రమణ, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement