ముంపు ముంగిట్లో కుక్కలగూడూర్‌ | kukkalagudur is ready to palil village | Sakshi
Sakshi News home page

ముంపు ముంగిట్లో కుక్కలగూడూర్‌

Published Thu, Jul 28 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

ముంపు ముంగిట్లో కుక్కలగూడూర్‌

ముంపు ముంగిట్లో కుక్కలగూడూర్‌

  • గ్రామ శివారుకు చేరుకున్న ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌
  • సమీప గ్రామాలకు నిలిచిపోనున్న రాకపోకలు
  • ఉపాధి కోల్పోనున్న గీత కార్మికులు 
  • పూర్తిస్థాయి ముంపుగా ప్రకటించాలని గ్రామస్తుల డిమాండ్‌
  • బసంత్‌నగర్‌ : రామగుండం మండలం కుక్కలగూడుర్‌ గ్రామం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ ముంపు గుప్పిట్లోకి వెళుతోంది. గతకొద్ది రోజులుగా ఎల్లంపల్లి ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్‌ లోనికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్‌ సామర్థ్యానికి అనుగుణంగా అధికారులు ఈసారి నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో బ్యాక్‌ వాటర్‌ గురువారం కుక్కలగూడుర్‌ గ్రామ శివారుకు చేరింది. గ్రామ శివారులోని ఉన్న బుగ్గ ఒర్రె పూర్తిగా బ్యాక్‌ వాటర్‌తో నిండిపోయి గ్రామంలోని రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయిలో నిండితే బ్యాక్‌ వాటర్‌ మరింత పెరిగి గ్రామంలోకి వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారు. వరద నీటి కారణంగా ఇళ్లలోకి విష సర్పాలు, ఇతర జంతువులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  
     
    నిలిచిపోనున్న రాకపోకలు
    ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌తో కుక్కలగూడుర్‌తోపాటు సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోనున్నాయి. ధర్మారం, వెల్గటూర్‌ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి రామగుండం, గోదావరిఖనికి వెళ్లే వారు కుక్కలగూడుర్‌ గ్రామ శివారు నుంచి మద్దిర్యాల మీదుగా వెళ్తుంటారు. ప్రస్తుతం ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌ ప్రధాన రహదారిపై ఉన్న లోలెవల్‌ బ్రిడ్జిపైకి చేరింది. ప్రాజెక్ట్‌లోకి ఇంకా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శుక్రవారం బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో వాహనదారులు బసంత్‌నగర్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.  
     
     గీత ఉపాధికి దెబ్బ
    ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌తో కుక్కలగూడుర్‌ గ్రామానికి చెందిన గీత కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. గ్రామంలో మొత్తం 150 వరకు గీత కార్మిక కుటుంబాలు ఉన్నాయి. వీరంతా కులవృత్తిపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ శివారులోని బుగ్గ ఒర్రె నిండిపోవడం, సగానికి పైగా తాటి చెట్లు ఒర్రె ఒడ్డును ఆనుకుని ఉండటంతో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవేళ అనువుగా ఉన్న చెట్లను గీసి కల్లు తెచ్చినా,  రాకపోకలు నిలిచిపోయిన కారణంగా అంతగా గిరాకీ ఉండదని గీత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
     
     పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించాలి
    – బొంకూరి శంకర్, సర్పంచ్‌
    ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ ముంపు కింద గ్రామంలో కేవలం 117 ఇళ్లను మాత్రమే తీసుకుని పరిహారం చెల్లించారు. గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని ఐదేళ్లుగా పోరాడుతున్నం. వర్షాలు ఎక్కువైతే గ్రామం చుట్టూ వరద నీరు చేరే అవకాశం ఉంది. ఇప్పుడైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మా ఊరును ముంపు గ్రామంగా తీసుకుని పరిహారం అందించాలి. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement