‘కుమ్రం భీం’ జిల్లా అని ఉండాలి
-
పేరు విషయంలో చరిత్రాత్మక తప్పు జరగకుండా చూడాలి
-
ఏవోకు ఆదిమ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం వినతి
ఆదిలాబాద్ రూరల్ : ప్రస్తుతం జిల్లాల ఏర్పాటుపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన తరుణంలో, ఆదివాసీ పోరాటయోధుడు కుమ్రం భీం పేరును పలువురు కొమరం భీంగా పేర్కొంటూ తప్పుగా ప్రచురించడం, పలకడం చేస్తున్నారని.. కొమరం భీం బదులు కుమ్రం భీంగా ఉండాలని ఆదిమ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కుడ్మెత భీంరావు మాట్లాడుతూ, కుమ్రం భీం పేరిట జిల్లాను ఏర్పాటు చేయడంపై యావత్ ఆదివాసీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కుమ్రం భీం వర్ధంతికి హాజరైన సీఎం చంద్రశేఖర్‌రావు గిరిజనులపై వరాల జల్లు కురిపించారని పేర్కొన్నారు. జిల్లాలోని జోడేఘాట్‌లో కుమ్రంభీం స్మారక ఉద్యానవనం, స్మతి చిహ్నం ఏర్పాటుతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోనున్నాయని తెలిపారు. ఆదివాసీ పోరాటయోధుడికి ప్రభుత్వం గుర్తింపునిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అయితే 22–08–2016న ఆదిలాబాద్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజిస్తూ జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో కుంరంభీం జిల్లా పేరును సైతం తప్పుగా కొమరంభీం జిల్లాగా ప్రచురించారని పేర్కొన్నారు. కానీ ఆదివాసీ గోండు తెగలో కొమురం అనే ఇంటి పేరు లేనేలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పుట్టిన ఆదివాసీ పోరాటయోధుడు కుమ్రంభీంకు, జోడేఘాట్‌కు చారిత్రక గుర్తింపునిచ్చిన ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు సరైన పేరుగా కుమ్రం భీం లేదా కుంరం భీం జిల్లాగా నామకరణం చేసి చరిత్రత్మాక తప్పిదం కాకుండా చూడాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉయికే విఠల్, రాష్ట్ర నాయకుడు సిడాం వామన్‌రావ్ పాల్గొన్నారు.