కర్నూలే నెంబర్ వన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కృష్ణా పుష్కరాల్లో కర్నూలు జిల్లాకు మొదటి స్థానం దక్కింది. ఏకంగా 93 శాతం మార్కులతో రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచింది. పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు, పరిశుభ్రత, భక్తుల అభిప్రాయాలు, మొదలైన 22 అంశాలపై నిర్వహించిన సర్వేలో కర్నూలు జిల్లాకు మొదటిస్థానం దక్కిందని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. అదేవిధంగా 20 అంశాల్లో కృష్ణా, గుంటూరుతో పోలిస్తే కర్నూలుకు మొదటి స్థానం దక్కిందన్నారు. కేవలం రెండు అంశాల్లో మాత్రమే కర్నూలు జిల్లాకు ద్వితీయ స్థానం వచ్చిందని పేర్కొన్నారు.
ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ
పుష్కరాలకు వచ్చే భక్తుల నుంచి ప్రతిరోజూ అభిప్రాయాలను సేకరించారు. నేరుగా కొంతమంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాలు పంచుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు వాయిస్ ఓవర్ సిస్టమ్ ద్వారా నేరుగా పుష్కర భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు కలెక్టర్ వివరించారు. ఇందుకు అనుగుణంగా ర్యాంకులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. కర్నూలు తర్వాత 88 శాతం మార్కులతో కృష్ణా జిల్లా ద్వితీయ స్థానంలో నిలవగా, 86 శాతంతో గుంటూరు జిల్లా తృతీయ స్థానం దక్కించుకుంది.
ఇది జిల్లా యంత్రాంగం సమష్టి కృషి
కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణలో జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేసిందని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అభిప్రాయపడ్డారు. అందువల్లే రాష్ట్రస్థాయిలో కర్నూలు జిల్లా అగ్రభాగాన నిలిచిందన్నారు. ఇది జిల్లా యంత్రాంగం సమష్టి కషికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
22న సీఎం రాక
శ్రీశైలానికి ఈనెల 22న(సోమవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన లింగాల ఘాట్‌ను సందర్శించనున్నారు. అయితే రాష్ట్రస్థాయిలోనే ప్రథమ ఘాట్‌గా నిలిచిన సంగమేశ్వరానికి వస్తారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు.