2100 నాటికి టాప్‌లో భారత్‌! | By 2100 Most Populated Country Is India | Sakshi
Sakshi News home page

2100 నాటికి టాప్‌లో భారత్‌!

Published Wed, Mar 14 2018 2:20 PM | Last Updated on Wed, Mar 14 2018 2:27 PM

Increasing of Population - Sakshi

2100 నాటికి విపరీతంగా జనాభా పెరుగుదల

పెరుగుట విరుగట కొరకే అంటారు పెద్దవారు. కానీ మన జనాభా పెరుగుతూనే పోతోంది. అది ఇప్పట్లో ఆగదని సర్వేలు చెబుతున్నాయి. 2024 నాటికి మన దేశం చైనా జనాభాను దాటేస్తుందని చాలా సర్వేలు చెబుతున్నాయి. మన జనాభా ఇప్పుడు దాదాపు 130 కోట్లు. చైనా జనాభా 140 కోట్లు. చైనాను దాటడం మనకు పెద్ద కష్టమైన పనేమీ కాదని తెలుసు.

అయితే ఈ పెరుగుదల 2060 వరకు కొనసాగుతుందని తర్వాత నెమ్మదిస్తుందనీ వరల్డ్‌ ఎకనమిక్‌ చేసిన ఒక సర్వేలో తెలిపింది. 2100 వరకు జనాభా పెరుగుదల రేటు తగ్గినా.. ప్రపంచంలో అత్యధికంగా జనాభా ఉండే దేశం మనదేనట.  చైనాలో మాత్రం అనూహ్యంగా జనాభా తగ్గుతుందట. అంతేకాకుండా జనాభా పెరుగుదల రేటు కూడా తగ్గిపోయి, రెండో స్థానంలో ఉంటుందట.

విపరీతమైన జనాభా పెరుగుదల

ఆ సర్వే తెలిపిన కొన్ని వివరాలు...మన రెండు దేశాల పరిస్థితి ఇలా ఉంటే...ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. ముఖ్యంగా ఆఫ్రికన్‌ దేశాల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. అమెరికాను తలదన్ని నైజీరియా మూడో స్థానంలో ఉంటుంది. అమెరికా జనాభా 2100 నాటికి దాదాపు 44కోట్లవరకు చేరుతుంది. పశ్చిమాఫ్రికా దేశాల జనాభా 80కోట్లకు చేరుతుంది. ఇది ప్రస్తుత యూరప్‌ జనాభా కంటే ఎక్కువ. యూరప్‌ జనాభా ఈ శతాబ్దాంతం వరకు తగ్గుముఖం పడుతుంది.

ఆఫ్రికా దేశాలైన కాంగో, టాంజానియా, ఇథియోపియా, ఉగాండా దేశాల్లో విపరీతమైన జనాభా పెరుగుదల కనిపిస్తుంది. అనూహ్యంగా  కాంగో ప్రస్తుత జనాభా 5కోట్లనుంచి 30కోట్ల వరకు చేరుకుంటుంది. దీంతో 2100నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 8వ దేశంగా అవతరిస్తుంది. ఆసియా దేశాల్లో కూడా జనాభా పెరుగుతుంది. పాకిస్థాన్‌ జనాభా 35కోట్లకు, ఇండోనేషియా జనాభా 30కోట్లకు చేరుతుంది.

తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు

జనాభా పెరుగుతూ ఉన్నా...సంతానోత్పత్తి రేటు మాత్రం అన్ని దేశాల్లో తగ్గుతుందని పేర్కొన్నారు. సంతానోత్పత్తి రేటు అధికంగా ఉండే ఆఫ్రికా దేశాల్లోనే 2000 -2005 మధ్య 5.1గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2010-2015 వచ్చేసరికి 4.7కి పడిపోయిందని తెలిపారు. యూరోప్‌లో జనాభా తగ్గుతూ ఉంది కానీ రేటు మాత్రం 2000-2015 మధ్యలో పెరిగిందని పేర్కొంది.

ఏ దేశంలోనైనా సరే అన్ని వయస్కులవారు సమతుల్యంగా ఉండాలి. అలాకాక వృద్దులు, పిల్లలు, యువత ఇలా అందరూ ఉండాలి. ఇలా ఉండాలంటే సరాసరిగా ఆ దేశ సంతానోత్పత్తి రేటు 2.1 ఉండాలి. కానీ, చాలా దేశాల్లో ఇది లోపిస్తుంది. 83 దేశాల్లో ఇలా లేనందువల్లే 2010 నుంచి 2015 మధ్య దాదాపు ప్రపంచ జనాభా 46శాతం తగ్గిందని తెలిపింది.

ఇలానే కొనసాగితే...

కావల్సినంత సంతానోత్పత్తి రేటు లేకపోవడం వల్ల జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా వారి పోషణకు, రక్షణకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఆర్థికంగా వెనుకబడతారు. వృద్ధ జనాభా దాదాపు 3 రెట్లకు పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 962 మిలియన్ల నుంచి 2100వరకు 3.1 బిలియన్లకు వరకు చేరుతుంది. పరిస్థితి ఇలానే ఉంటే  పేదరిక నిర్మూలన, ఆకలి బాధ, ఆరోగ్యం,  విద్య, లింగ వివక్షత లాంటి  సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోలేమని వరల్డ్‌ ఎకనామిక్స్‌ ఫోరమ్‌ సర్వే తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement