పేరు పేదలది.. పెత్తనం పెద్దలది
పేరు పేదలది.. పెత్తనం పెద్దలది
Published Thu, Sep 1 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
పేదలకు పట్టాలు..
ఎమ్మెల్యే అనుచరుని చేతిలో భూమి
13 ఏళ్లుగా పేదలకందని ఇంటి స్థలం
కలగానే మిగిలిన సొంతిల్లు
సుందరపల్లి (కె.గంగవరం) : ‘మేం ఏం చెబితే అదే జరుగుతుంది. స్థలం కావాలని అడిగితే ఖబడ్దార్. ..మేం ఇచ్చినప్పుడే తీసుకోండి.’ ఇదీ అధికార పార్టీ నేత హుకుం. నియోజకవర్గంలోని కె. గంగవరం మండలం సుందరపల్లిలో స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అనుచరుని అరాచకాలకు నిలువుటద్దం పడుతోందీ సంఘటన. 13 ఏళ్లుగా దేవస్థానం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు యథేచ్ఛగా పండించుకుంటున్నప్పటికీ అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
సుందరపల్లిలోని శ్రీసోమేశ్వరస్వామి దేవస్థానికి చెందిన సుమారు రెండు ఎకరాల భూమిని 2003లో గ్రామంలోని కొంత మందికి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సేకరించింది. 70 సెంట్ల భూమిని ఎస్సీలకు, 120 సెంట్ల భూమిని ఓసీలకు కేటాయిస్తూ అప్పటి తహసీల్దార్ లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. పట్టాలిచ్చారు గానీ ఆభూమిని మాత్రం ఇప్పటికీ వారికి అప్పగించలేదు. దేవస్థానం భూమిని ప్రభుత్వం సేకరించటంతో దేవస్థానం అధికారులు ఆ పంట భూమికి వేలం కూడా నిర్వహించలేదు. ఆ భూమిని ప్రభుత్వం మెరక చేసి పట్టాదారులకు అప్పగించాలి. కానీ ఆ విధంగా జరగలేదు. ప్రభుత్వం దేవస్థానం భూమిని సేకరించిందని చెప్పి గ్రామానికి చెందిన ఆ నేత ఆ భూమిని తన ఆధీనంలోనికి తీసుకున్నాడు. 13 ఏళ్లుగా సుమారు 2 ఎకరాల భూమిని తన అనుచరులతో సాగు చేయిస్తూ మగతాలు పొందుతున్నాడు. చేను వృథాగా ఉందని సాగు చేస్తున్నామని, వచ్చిన పంటను దేవుడి కోసంS ఖర్చు చేస్తున్నామని ఆయన కబుర్లు చెబుతున్నాడు. ఎవరైనా ఇదేమని అడిగినా, జమా ఖర్చులు చెప్పాలన్నా వారిపై దాడులు చేయిస్తూ తనమాటే చెల్లుబడి చేసుకుంటున్నాడు. ఇప్పటికైనా రెవెన్యూ, దేవస్థానం అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని తమకు అందజేసి న్యాయం చేయాలని పట్టాదారులు కోరుతున్నారు.
Advertisement