
భూ చక్రం ప్రయోగం
► రాజధాని ప్రాంతంలో భూసేకరణకు నోటిఫికేషన్
► తొలి విడత ఐదు గ్రామాల్లో 11.14 ఎకరాల సేకరణకు సిద్ధం
►పూర్తి స్థాయిలో చట్టబద్ధత సాధించని భూసేకరణ ఆర్డినెన్స్
► ఈ నెల 31తో ముగియనున్న గడువు.. ఆ తర్వాత 2013 చట్టమే..
►అందుకే సర్కారు హడావుడి నోటిఫికేషన్.. విపక్షాల తీవ్ర వ్యతిరేకత
►సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ఉండవల్లి, పెనుమాక, నవులూరు రైతులు కూరగాయలతో ధర్నా
► బలవంతంగా భూములు లాక్కోవడం సిగ్గుచేటని
► విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని నిర్మాణం పేరుతో రైతులనుంచి బలవంతంగా భూసేకరణ చేసేందుకు చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టింది. 2013 భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ వెలువడిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ ఆధారంగా బలవంతపు భూసేకరణకు అధికారులు శుక్రవారం నోటిఫికేషన్ జారీచేశారు. ఆర్డినెన్స్ గడువు ఈనెల 31తో ముగియనుండటంవల్లనే రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రప్రభుత్వ అంచనాల ప్రకారం తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో మొత్తం 3,892 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అయితే మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని రైతులు భూములు ఇచ్చేందుకు మొదటినుంచీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రకటించిన నాటి నుంచి ఆయా గ్రామాల రైతుల్లో ఆందోళన నెలకొంది.
తొలుత భూసమీకరణ చట్టం ద్వారా రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటిఫికేషన్‌ను జారీచేసింది. అయితే మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు మండలాల పరిధిలోని కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించలేదు. మూడు మండలాల పరిధిలో సుమారు 3,892 ఎకరాల భూమిని ఎలాగైనా సరే రైతుల నుంచి తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం తొలివిడతగా ఐదు గ్రామాల్లో భూసేకరణ చట్టం ప్రయోగించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదట తుళ్ళూరు-2, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, పిచుకలపాలెం, అనంతవరంలలో భూమిని సేకరిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ ఐదు గ్రామాల పరిధిలో 11.14 ఎకరాలు సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే గ్రామకంఠాల నిర్ణయంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని తుళ్లూరులో రైతులు ఆందోళనకు దిగారు. తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజధాని సలహా కమిటీ, సీఆర్‌డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. భూసమీకరణ, అసైన్డ్, గ్రామకంఠాల వివాదాలపై వారితో చర్చించినట్లు సమాచారం. మరోవైపు భూసేకరణ నోటిఫికేషన్‌పై ఉండవల్లి, పెనుమాక, నవులూరు రైతులు కూరగాయలతో సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వీరికి వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు మద్దతు తెలిపారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కోవడం సిగ్గుచేటనీ, ఈ చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు.
ఆర్డినెన్స్ గడువు వల్లనే హడావుడి
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ విడుదలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భూ సేకరణ ఆర్డినెన్స్‌కు అనుగుణంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు గ్రామాల్లో భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూ సేకరణ చట్టం ప్రయోగించారు. మళ్లీ ఆయనే భూ సేకరణ చట్టం ప్రయోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే యూపీఏ సర్కారు 2013లో తెచ్చిన భూసేకరణ బిల్లుకు సవరణలు చేస్తూ ఎన్డీయే సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో చట్టబద్ధత సాధించలేదు.
రాజకీయపార్టీలు వ్యతిరేకించడంతో బిల్లు ఆమోదం పొందే పరిస్థితులు కనిపించడంలేదు. ఎన్డీయేకు రాజ్యసభలో బలం లేక మూడు ఆర్డినెన్స్‌లు విడుదల చేసింది. మూడో ఆర్డినెన్స్ గడువు కూడా ఈనెల 31తో ముగియనుంది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌కు మరోసారి గడువు పొడగిస్తుందా? లేకుంటే ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో భూ సేకరణ చట్టం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుంటుందా? అనేది తేలాల్సి ఉంది. ఆర్డినెన్స్ చట్టరూపం పొందకపోయినా, మరోసారి ఆర్డినెన్స్ రాకున్నా 2013 భూసేకరణ చట్టమే వర్తిస్తుంది. దానికింద భూసేకరణ చాలా కష్టం కావడంవల్లనే రాష్ట్రప్రభుత్వం హడావుడి పడటం విమర్శలకు గురవుతోంది.
ఓవైపు చర్చ జరుగుతుంటే భూసేకరణకు నోటీసులా
సాక్షి, న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్సుపై పార్లమెంటరీ కమిటీ చర్చిస్తుండగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు గ్రామాల భూములను లాక్కోడానికి నోటీసులు జారీ చేయడం దారుణమని సీపీఎం నేత రాఘవులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భూసేకరణను తిప్పికొడతామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఓవైపు చర్చ జరుగుతుంటే భూసేకరణకు నోటీసులా: సీపీఎం నేత రాఘవులు ఆగ్రహం
భూసేకరణ ఆర్డినెన్సుపై పార్లమెంటరీ కమిటీ చర్చిస్తుండగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు గ్రామాల భూములను లాక్కోడానికి నోటీసులు జారీ చేయడం దారుణమని సీపీఎం నేత రాఘవులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భూసేకరణను తిప్పికొడతామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రతిఘటిస్తాం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
ప్రభుత్వం బలవంతపు భూ సేకరణను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రతిఘటిస్తాం. కార్పొరేట్ల కోసమే ప్రభుత్వం ఇంత భారీగా భూములు సేకరిస్తోంది. పరిశ్రమలు, విద్యుత్ ప్లాంట్లు, టూరిజం పేరుతో లక్షల ఎకరాలు సేకరించేందుకు సిద్ధపడుతోంది. బలవంతపు భూ సేరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, కూలీలకు మా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ విషయంలో అవసరమైతే అన్ని పార్టీలతో కలిసి ఐక్య ఉద్యమాన్ని చేపడతాం. అవసరమైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.
భూమి పిచ్చి పట్టింది: రామకృష్ణ
వేలాది ఎకరాల భూమిని లాగేసుకునేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి భూమి పిచ్చి పట్టింది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి సేకరించింది. ప్రభుత్వానికి చెందినది 53వేల ఎకరాలు ఉంది. ఇంకా అటవీ భూములు తీసుకుంటామంటున్నారు. అయినా సారవంతమైన బహుళ పంటలు పండే భూముల్ని రైతుల వద్ద నుంచి ఇంకా లాగేసుకునేలా బలవంతపు భూ సేకరణ చేయడం దారుణం. రాజధాని సాకుతో పెద్ద ఎత్తున భూమిని సేకరించి కార్పొరేట్‌లకు కట్టబెట్టే ప్రయత్నాలు ప్రతిఘటిస్తాం.