
సంతకం పెడితే భూమి పోయినట్లే!
మచిలీపట్నం: బందరు పోర్టు, పారిశ్రామిక క్యారిడార్ కోసం భూసమీకరణకు రంగం సిద్ధమైంది. బందరు మండలంలో 33,601 ఎకరాల భూమిని సమీకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా మచిలీపట్నం డీప్‌వాటర్ పోర్ట్ మరియు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కొరకు భూసమీకరణ పథకం భాగస్వామ్య దరఖాస్తు, ప్రమాణ పత్రం ఫారం–3 ని జేసీ గంధం చంద్రుడు సోమవారం తన చాంబర్‌లో విడుదల చేశారు. అలాగే భూసమీకరణపై అభ్యంతరాలు, అభిప్రాయాన్ని వ్యక్తీకరించటం కోసం ఫారం–2ను విడుదల చేశారు. వీటిని డెప్యూటీ కలెక్టర్లు, వీఆర్వోలకు సోమవారం సాయంత్రానికి అందజేశారు.
మంగళవారం బందరు మండంలోని 27 గ్రామాలు, పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామంలో డెప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్, వీఆర్వోలు అంగీకారపత్రాలు, అభ్యంతర పత్రాలు స్వీకరించనున్నారు. భూసమీకరణకు సంబంధించి అంగీకారపత్రాన్ని 16 పేజీల్లో ముద్రించగా, అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఇచ్చిన దరఖాస్తును రెండు పేజీల్లో ముద్రించారు. అంగీకరపత్రానికి రశీదు, విచారణ నోటీసు అనే పేరుతో ప్రత్యేక కాలమ్‌ను ఇవ్వగా, అభ్యంతర పత్రానికి ఎలాంటి రశీదును కల్పించలేదు. దీంతో రైతుల్లో అయోమయం నెలకొంది.
అంగీకారం పత్రం ఇచ్చిన మరుసటి రోజే భూమి స్వాధీనం
బందరు పోర్టు, పారిశ్రామిక క్యారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ముద్రించిన ఫారం–3లో రైతులు వివరాలు నమోదు చేసి సంతకం పెడితే మరుసటి రోజే సంబంధిత భూమిని సర్వే చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఫారం–3లో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ భూసమీకరణ పధకంలో వ్యక్తి లేదా వ్యక్తుల భాగస్వామ్యం నిమిత్తం భూమిని సమీకరించిన అనంతరం అభివృద్ధి చేసి దానిలో నిష్పత్తి ప్రకారం కొంత భూమిని పరిహారం నిమిత్తం ఇవ్వటం, ఇతర రాయితీలు ఇచ్చేందుకు అభ్యర్ధన అంటూ ముద్రించారు. రైతుల పేరు, వయసు, తండ్రి పేరు, నివాసం తదితర వివరాలు పూర్తి చేయాల్సి ఉంది. భూసమీకరణకు భూమిని ఇస్తే ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ వివరాలను ఫారం–3లో ముద్రించారు. భూమిని ఇచ్చేందుకు అంగీకరిస్తున్నానని తన పేరున ఉన్న భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధారాలను పరిశీలన, రికార్డు కోసం విచారణ సమయంలో ఒరిజినల్ పత్రాలను చూపుతామని అంగీకరపత్రంలో పేర్కొన్నారు.
మంత్రి, ఎంపీ సమాలోచనలు
భూసమీకరణ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు. పార్టీ సమీక్షా సమావేశం పేరుతో ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో పలు దఫాలుగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవటం, ఒకరిద్దరు టీడీపీ నాయకులను ఆర్డీవో కార్యాలయానికి పంపే ప్రక్రియ కొనసాగింది. ఓ వైపు ఈ తతంగం జరుగుతుండగానే రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా, లేదా గ్రామాల్లోకి వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే అంశాలపై ఆరా తీస్తే పనిలో కొందరు టీడీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు. టీడీపీ నాయకులు ఎంతగా ప్రలోభపెట్టినా తమ భూములను ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రైతులు ఖరాకండిగా చెబుతున్నారు.