కత్తిపోట్లకు దారితీసిన భూ వివాదం
Published Tue, Aug 23 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
నెల్లిపాక :
భూ వివాదం నేపథ్యంలో తండ్రీ కొడుకుల మధ్య తలెత్తిన ఘర్షణ కత్తితో దాడి చేసుకునేందుకు దారితీసింది. ఘర్షణకు అడ్డు వచ్చిన వ్యక్తిని, తన కొడుకుని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చిన ఈ ఘటన ఎటపాక మండలం చింతలపాడు వలస ఆదివాసీ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సోడె ఉంగయ్య, సోడె దేవయ్య తండ్రీకొడుకులు. వీరి మధ్య సోమవారం రాత్రి వారి పోడుభూమి సాగు విషయంలో గొడవ జరిగింది. అది తీవ్రరూపం దాల్చి కత్తులతో దాడి చేసుకునే పరిస్థితి ఎదురైంది. అదే గ్రామానికి చెందిన మడకం భీమరాజు వారిని వారించేందుకు యత్నించాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉంగయ్య తన చేతిలో ఉన్న కత్తితో దేవయ్యతో పాటు భీమరాజును కూడా పొడిచాడు. దేవయ్యకు గుండెలో, కడుపుపై, భీమరాజుకు కడుపులో తీవ్ర గాయం కావడంతో వారిని భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్వాస అందకపోవడంతో భీమరాజుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం భీమరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
Advertisement