భూందాం! | land rate hike to august first | Sakshi
Sakshi News home page

భూందాం!

Published Fri, Jul 28 2017 10:31 PM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM

భూందాం!

భూందాం!

ఆగస్టు 1 నుంచి పెరగనున్న భూముల విలువ  
– 10 నుంచి 21 శాతం పెంపునకు ఆమోదం
– అభ్యంతరాల ఊసెత్తని రిజిస్ట్రేషన్‌ అధికారులు
– రెండ్రోజులుగా కిక్కిరుస్తున్న కార్యాలయాలు


అనంతపురం టౌన్‌: భూముల విలువల మరోసారి పెరగనుంది. ఇందుకు సంబంధించి స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిపాదిత ధరలకు శుక్రవారం నాటికి కమిటీలన్నీ ఆమోదముద్ర వేశాయి. దీంతో ఆగస్టు 1వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకున్న రేట్లతో పోలిస్తే 10 నుంచి 21 శాతం పెంపు కనిపిస్తోంది. జిల్లాలో అనంతపురం జిల్లా రిజిస్ట్రార్‌ పరిధిలో గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, పామిడి, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అనంతపురం, అనంతపురం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి.

హిందూపురం జిల్లా రిజిస్ట్రార్‌ పరిధిలో బుక్కపట్నం, చిలమత్తూరు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, తనకల్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో సైతం ధరలను పెంచారు. కార్యాలయాల వారీగా ధరల పెంపు పూర్తయింది. చదరపు గజానికి గరిష్టంగా 21 శాతం పెంచారు. భవన నిర్మాణ స్థల విలువలను కూడా 10 శాతానికి పైగా పెంచేశారు. కొత్త ధరల అమలుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓ చైర్మన్‌గా.. తహసీల్దార్, ఎంపీడీఓలు, ఆడిట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సభ్యులుగా ఉన్న కమిటీలతో పాటు అర్బన్‌ ప్రాంతాలకు సంబంధించి జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా.. జెడ్పీ సీఈఓ, మునిసిపల్‌ కమిషనర్‌ సభ్యులుగా, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కన్వీనర్‌గా ఉన్న కమిటీలు ఆమోదం తెలిపాయి.   

అభ్యంతరాలు స్వీకరించకుండానే ఆమోదం
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా తయారు చేసిన భూముల విలువల సవరణకు సంబంధించి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నా తూతూమంత్రంగా చేపట్టి ఆమోదముద్ర వేశారు. సాధారణంగా ఏటా ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెరుగుతుంది. ఇందుకోసం నెల ముందుగానే అధికారులు ప్రక్రియ ప్రారంభించాలి. నగరాలు, పట్టణాల వారీగా ప్రస్తుత, ప్రతిపాదిత మార్కెట్‌ విలువలను ఖరారు చేయాలి. వాటిని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించాలి.

గత ఏడాది జూలై 30వ తేదీన భూముల విలువ పెంపు ఉత్తర్వులు రావడంతో అభ్యంతరాలు తీసుకోలేదు. అయితే ఈ ఏడాది ముందుగానే ఉత్తర్వులు వచ్చినా అధికారులు నిర్లక్ష్యం వీడలేదు. కనీసం భూముల విలువ పెరుగుతుందనే సమాచారం కూడా జనాలకు తెలియకుండా చేసి సవరించిన స్థిరాస్తి మార్కెట్‌ విలువల అమలుకే మొగ్గు చూపారు. హడావుడిగా ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ విలువను పెంచేసి అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో అంతిమంగా భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వాళ్లపై భారం పడనుంది. భూముల విలువ పెరుగుతుందనే విషయం తెలియడంతో జిల్లా వ్యాప్తంగా రెండ్రోజుల నుంచి కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. అనంతపురం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ రెండ్రోజుల్లోనే 250 పైగా రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. పైగా శ్రావణమాసం ప్రారంభం కావడంతో అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఊపందుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement