రవాణాశాఖలో స్తంభించిన సేవలు | Registration Problems In TSRTC | Sakshi
Sakshi News home page

రవాణాశాఖలో స్తంభించిన సేవలు

Published Fri, Jun 14 2019 1:26 PM | Last Updated on Fri, Jun 14 2019 1:26 PM

Registration Problems In TSRTC - Sakshi

జిల్లా రవాణా శాఖ కార్యాలయం అస్తవ్యస్తంగా తయారైంది. సేవలు స్తంభించడంతో వివిధ పనులపై ఆఫీస్‌కు వచ్చిన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోజూ తిరగలేక.. ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆర్టీఏలో ఇటీవలి వరకు ఏజెంట్ల హవా కొనసాగగా.. తాజాగా ఓ సంఘం నేత జోక్యంతో గందరగోళంగా మారింది .  తమ మీదకు ఏం వస్తుందో.. ఏం జరుగుతుందోననే భయంతో పలువురు ఉద్యోగులు సెలవులపై వెళ్లారు. దీంతో వాహన రిజిస్ట్రేషన్లలో ఆటంకంతోపాటు లైసెన్స్‌ల జారీ కూడా తూతూమంత్రంగానే సాగుతోంది. ఫిట్‌నెస్, తనిఖీల వంటి పనులన్నీ స్తంభించాయి.

సాక్షి, మెదక్‌:  రవాణా శాఖలో ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారానే కార్యకలాపాలు సాగుతున్నాయి. డ్రైవింగ్‌ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ ఇతరత్రా పనులు కావాలంటే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇదంతా సులువు కాదు.. ఈ నేపథ్యంలో వాహనదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వారు వివిధ పనుల నిమిత్తం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. మెదక్‌లో ఇటీవల వరకు ఏజెంట్ల హవా కొనసాగింది. వారు ఆడిందే ఆట.. పాడిందే పాట. ఎవరైనా సరే వారు చెప్పిన మొత్తం కట్టాల్సిందే. లేదంటే వారి పని ఒక అడుగు కూడా ముందుకు పడదు.

ఉదాహరణకు ఫోర్‌ వీలర్‌ వాహన రిజిస్ట్రేషన్‌ డైరెక్ట్‌గా అయితే రూ.2 వేలు అవుతుంది. అదే ఏజెంట్ల వద్ద రూ.8 వేల వరకు అప్పజెప్పాల్సిందే. ఎలాంటి పత్రం లేకున్నా అధికారులతో కుమ్మక్కు కావడంతో ఫైల్‌ ముందుకు కదలడంతోపాటు చకచకా పని పూర్తవుతుంది. సదరు వాహన యజమాని డైరెక్ట్‌గా ఆర్టీఏ కార్యాలయానికి పోతే ఈ పత్రం లేదు.. అది కరెక్ట్‌గా లేదంటూ తిప్పి పంపడం మామూలు విషయం.  వాహనదారులు ఏజెంట్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో ఏజెంట్లు ఒక్కటై అధికారులు, సిబ్బందికో రేటు ఫిక్స్‌ చేసి ప్రజలను నిలువునా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఓ సంఘం నేత బెదిరింపులతో..
మెదక్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఒక సంఘం నేతగా చెప్పుకొంటూ ప్రభుత్వ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లను బ్లాక్‌మెయిలింగ్‌ చేసి డబ్బులు గుంజేవాడు. ఈ క్రమంలో సంఘం నుంచి అతడిని వెలివేశారు. ఆ తర్వాత ఆయన కన్ను రావాణా శాఖపై పడింది. మెదక్‌ ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏజెంట్ల కార్యకలాపాలు.. వ్యవహారాలపై దృష్టి సారించారు. అందులో జరుగుతున్న అవినీతి, అధికారులు, సిబ్బందికి అందుతున్న ముడుపులపై రవాణా శాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. స్థానిక అధికారులు, సిబ్బందిపై ఇటీవల ఒత్తిడి పెంచడంతో వారు కలవరానికి గురయ్యారు.

ఈ క్రమంలో సమస్య పరిష్కారానికి ఏదో ఒకటి చేయండని ఏజెంట్లకు అధికారులు  సూచించారు. ఏజెంట్లందరూ సమావేశమై కొంత మొత్తాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆ తర్వాత సదరు సంఘం నాయకుడికి తమ ఆఫర్‌ను తెలపగా సరిపోదని, పెంచాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఈ పంచాయితీ తెగకపోవడంతో ఏజెంట్లు తమ దందాను నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటుపోయి ఎటు వస్తుందోనన్న భయంతో ఆర్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు సెలవుల్లోకి వెళ్లారు.

విధుల్లో డీటీఓ, క్లర్క్‌ మాత్రమే..
ఆర్టీఓ కార్యాలయానికి రోజుకు రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌లు, రెన్యూవల్స్, పేరు మార్పిడి వంటి వివిధ పనులకు వందలాది మంది వస్తుంటారు. ఆర్టీఓ కార్యాలయంలో డీటీఓ, ఇద్దరు ఎంవీఐలు, ఇద్దరు ఏఎంవీఐలు, ఒక ఏఓ, ఇద్దరు యూడీసీలు, ఇద్దరు జూనియర్‌ క్లర్క్స్‌ ఉండాలి. ప్రస్తుతం డీటీఓ, ఒక క్లర్క్‌ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం సరిపోనూ సిబ్బంది లేకపోవడంతో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వాహనదారులు రోజుల తరబడి ఆర్టీఓ కార్యాలయానికి చక్కర్లు కొడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణచార్జీ లు భారం కావడంతో ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొం టున్నారు.

ప్రస్తుతం అంతంత మాత్రమే..
వాహన లైసెన్స్, రిజిస్ట్రేషన్లకు సంబంధించి రోజుకు సమారు 150 చొప్పున మొత్తం 300 స్లాట్లు బుక్‌ అవుతున్నాయి. పూర్తి స్థాయిలో వాహనదారులు రాకున్నా.. సుమారు 150 నుంచి 175 మంది వరకు వచ్చేవారు. వాటిని ఆర్టీఏ అధికారులు క్లియర్‌ చేసేవారు. ప్రస్తుతం 50 నుంచి 70 వరకు మాత్రమే క్లియర్‌ అవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రక్షాళన చేయాలి..
ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌ల వంటి ప్రక్రియకు సంబంధించి సామాన్యులకు అవగాహన అంతంతే. పాత కాలం నాటి అధికారులు, సిబ్బందికి సైతం పూర్తి స్థాయిలో అవగాహన లేదు. ఈ క్రమంలో వాహనదారులతో పాటు ఆర్టీఓ అధికారులు ఏజెంట్లపై ఆధారపడాల్సి వస్తోంది. దళారుల నుంచి రోజువారీగా మామూళ్లు అందుతుండడంతో అవినీతికి అలవాటు పడ్డ అధికారులు ఏజెంట్ల వ్యవస్థ రద్దయినప్పటికీ వారి వైపే మొగ్గుచూపుతున్నారు. మెదక్‌లో ప్రస్తుతం ఏజెంట్లు రాకపోవడంతో సేవలు స్తంభించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా కలెక్టర్, ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రక్షాళన చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

తిప్పుకొంటున్నారు..

టాటా ఏస్‌ వాహన రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చా. ఏజెంట్‌ దగ్గరికెళ్తే రూ.8 వేలు అడిగాడు. రూ.2 వేలకు అయ్యే పనికి అంత అడిగాడు. అన్ని డబ్బులు ఇచ్చే స్థోమత లేకపోవడంతో నేనే నేరుగా చేసుకునేందుకు సిద్ధమైన. అధికారులు ఇది లేదని.. అది లేదని అంటున్నారు. ప్రతి చిన్న పొరపాటును చూపుతూ తిప్పుకొంటున్నారు. వేరే వారు ఏజెంట్‌ నుంచి వస్తే.. ఏమీ చూడకుండానే ఓకే చేశారు. – నాగరాజు, కొంత్వాన్‌పల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement