జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి భూ దందాలకు పాల్పడుతోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. మంగళవారం జడ్చర్లలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లో ప్రాజెక్టుల కోసం 123 జీఓను అడ్డం పెట్టుకుని బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతలపై రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అబద్ధాలతో ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. జిల్లా ప్రయోజనాలను రాష్ర్ట మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి తాకట్టు పెడుతున్నారన్నారు. ఈ అంశంపై వారితో చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు.
రిజర్వాయర్ల డిజైన్లు మార్చాలి
ఆయా ముంపు ప్రాంతాలను తగ్గించేలా రిజర్వాయర్ల డిజైన్లు మార్చాలని వెంకట్ డిమాండ్ చేశారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రజలకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు అండగా ఉంటామని, ఈనెల 25న జడ్చర్లలో సదస్సు నిర్వహిస్తామన్నారు. 29న రాష్ట్రస్థాయిలో హైదరాబాద్ నగరంలో సదస్సు ఉంటుందన్నారు.
ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జబ్బార్, కార్యదర్శి ఎ.రాములు, సీఐటీయూ ఉపాధ్యక్షుడు దీప్లానాయక్, సీపీఎం మండల కార్యదర్శి తెలుగు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
‘భూ దందాలకు పాల్పడుతున్న ప్రభుత్వం’
Published Wed, Jun 22 2016 9:09 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM
Advertisement