లారీ బీభత్సం
బ్రేక్‌లు ఫెయిలై ఆగి ఉన్న కార్లు, బస్సును ఢీకొన్న వైనం
రెండు కార్లు నుజ్జునుజ్జు తప్పిన పెను ప్రమాదం
లంకెలపాలెం కూడలిలో ఘటన
అగనంపూడి : నిత్యం రద్దీగా ఉండే లంకెలపాలెం కూడలిలో బ్రేకులు ఫెయిలై ఓ లారీ బీభత్సం సృష్టించింది. భయానక వాతావరణాన్ని కల్పించింది. సంఘటన తీరు చూసిన వారికి పెద్ద ఘోర కలి జరిగే ఉంటుందని భావించినా, పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధి లంకెలపాలెం కూడలిలో ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖనగరానికి చెందిన నాగేశ్వరరావు, చక్రధర్, శరత్‌కుమార్‌లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం మూడు కార్లలో తలుపులమ్మలోవకు బయలుదేరారు. ఉదయం 8.30 గంటలకు లంకెలపాలెం కూడలిలో సిగ్నల్ లైట్లు పడడంతో మూడు కార్లు వరుసగా ఆగాయి. పక్కనే శివాజీపాలేనికి చెందిన వెంకటస్వామి అనకాపల్లి వెళ్లడానికి భార్య సత్యవేణితో కలిసి మరో కారులో ప్రయాణిస్తూ మూడు కార్ల పక్కనే ఆగారు. దాని వెనక ఫార్మాసిటీ రోడ్డులోకి మలుపు తిరగడానికి మైలాన్ కంపెనీ ఉద్యోగుల బస్సు నిలిచింది. ఇంతలో గాజువాక వైపు నుంచి వెనకగా వచ్చిన లారీ బ్రేక్‌లు ఫెయిల్ అవ్వడంతో ముందు ఆగిన కారును ఢీకొంది. అక్కడితో ఆగకుండా మరో మూడు కార్లను, ఫార్మా కంపెనీ బస్సును ఢీకొంది. +
ఇదే సమయంలో కూడలిలోని బ్యాకరీలో పనిచేస్తున్న కె.విష్ణు(19) రోడ్డు దాటుతుండగా, రెండు కార్ల మధ్యలో ఇరుక్కోవడంతో ఎడమ కాలు విరిగిపోయింది. ఈ సంఘటనలో శివాజీనగర్‌కు చెందిన వెంకటస్వామి, సత్యవేణి, మరో రెండు కార్లలోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, నాగేశ్వరరావు, చక్రధర్, శరత్‌కుమార్, సత్యవతి, సౌజన్యలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి 108 సర్వీసులో ఇంటికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో రెండు కార్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. దీంతో లంకెలపాలెం కూడలిలో సుమారు గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, ప్రమాదానికి గురైన కార్లను అక్కడ్నుంచి తొలగించారు.