మాదాపూర్‌లో మరుగుదొడ్లను పరిశీలిస్తున్న అంజు ఉప్పల్
-
కేంద్ర ప్రతినిధి అంజు ఉప్పల్
-
మరుగుదొడ్ల నిర్వహణ, అక్షరాస్యతపై ఆరా
బెజ్జంకి/మానకొండూర్/హుజూరాబాద్ : ప్రజలు తమ ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, అధికారులు ఆ దిశగా అవగాహన కల్పించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, స్వచ్ఛభారత్ ప్రతినిధి అంజు ఉప్పల్ అన్నారు. మంగళవారం బెజ్జంకి మండలం మాదాపూర్, మానకొండూర్ మండలం లలితాపూర్, హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామాలను సందర్శించారు. పారిశుధ్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు ఇంటింటికీ తిరిగి పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్మాణాలు, నిర్వహణ, అక్షరాస్యత, పంటలు సాగు, గ్రంథాలయం తదితర విషయాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళాసంఘాల సభ్యులు, గ్రామస్తులతో చర్చించారు. ఆరుబయట మల, మూత్ర విసర్జన ఆరోగ్యానికి చేటుచేస్తుందని పేర్కొన్నారు. సిర్సపల్లిలో ఇంకా 77 నిర్మాణాలు జరగాల్సి ఉన్నట్లు అధికారులు నివేధిక ఇచ్చారని, వీటిని 10 రోజుల్లోగా పూర్తి చేయాలని, అంతవరకు బహిరంగ మల విసర్జన చేయకుండా ఉన్నవారివి ఉపయోగించుకోవాలని సూచించారు. మాదాపూర్, లిలితాపూర్ గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించిన సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి, మర్రి కవితను అభినందించారు. వారివెంట ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రకాశ్, ఈఈ రాఘవులు, స్వచ్ఛ బారత్ కో–ఆర్డినేటర్ కిషన్‌స్వామితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.