ప్రజల వద్దకే న్యాయసేవ
– జిల్లా జడ్జి హరిహరనందశర్మ
హిందూపురం అర్బన్ : గడపగడపకూ న్యాయసేవలపై చైతన్యం కల్పించి వారి సమస్యలను చట్టపరంగా రాజీమార్గంలో పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజల వద్దకు న్యాయసేవ నినాదంతో ముందుకు పోతున్నామని జిల్లా జడ్జి హరిహరనందశర్మ అన్నారు. హిందూపురం కోర్టుకు మంగళవారం సాయంత్రం విచ్చేసిన ఆయన ఈనెల 5న హైకోర్టు జడ్జి ప్రారంభించనున్న రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు కొత్త భవనాన్ని పరిశీలించారు. ప్రారంభోత్సవాన్ని న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రజలు కలసి çపండుగలా జరుపుకోవాలని కోరారు. అనంతరం కోర్టు ఆవరణలో పారా వలంటీర్లు, న్యాయవాదులతో సమావేశమయ్యారు. పారామిలటరీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి కోర్టు ద్వారా న్యాయసేవలు అందే పరిస్థితి వివరించాలన్నారు.
చాలామంది ప్రభుత్వ పథకాలు అందక, లైసెన్సులు, రేషన్‌కార్డులు తదితర సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. అలాంటి వారికి కోర్టు ద్వారా న్యాయం అందుతోందోన్న భరోసా కల్పించాలని సూచించారు. హిందూపురం అదనపు జిల్లా జడ్జి రాములు, న్యాయమూర్తులు నాగశేషయ్య, జానీబాషా, ఆనందతీర్థ, హరిప్రియ, పీపీ రాజశేఖర్, ఏజీపీ సుదర్శన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, సిద్ధు, శివశంకర్ పాల్గొన్నారు.